అమిత్ షా పాదయాత్రకు బీజేపీ శ్రేణుల భారీ ఏర్పాట్లు
లక్ష మంది హైదరాబాద్ ప్రజలతో చారిత్రాత్మక పాదయాత్ర
బహిరంగ సభకు సన్నాహాలు
బీజేపీ మైనార్టీ మోర్చా రాష్ట్ర ప్రధాన కార్యదర్శి రజనీష్ జైన్
కోల్ బెల్ట్ న్యూస్ ప్రతినిధి:
ప్రజాస్వామ్యాన్ని కాపాడటం, రాజ్యాంగబద్ధమైన సంస్థల పరిరక్షణే లక్ష్యంగా ‘ప్రజాస్వామ్యాన్ని కాపాడుదాం – అరాచకాన్ని తరిమికొడదాం’ అనే నినాదంతో బీజేపీ ఆధ్వర్యంలో నిర్వహించనున్న మహా పాదయాత్రకు పార్టీ శ్రేణులు సిద్ధమవుతున్నాయని బీజేపీ మైనార్టీ మోర్చా రాష్ట్ర ప్రధాన కార్యదర్శి రజనీష్ జైన్ తెలిపారు. ఆదివారం హైదరాబాద్లో ఆయన మాట్లాడుతూ సోమవారం కేంద్ర హోంమంత్రి అమిత్ షా హైదరాబాద్కు రానున్న నేపథ్యంలో పాదయాత్ర, బహిరంగ సభ నిర్వహణకు రాష్ట్ర పార్టీ నాయకత్వం విస్తృత ఏర్పాట్లు చేపట్టిందన్నారు.

ఈ కార్యక్రమంలో భాగంగా లక్ష మంది హైదరాబాద్ ప్రజల భాగస్వామ్యంతో భారీ పాదయాత్ర నిర్వహించేందుకు ప్రణాళిక రూపొందించినట్లు వెల్లడించారు. ఈ చారిత్రాత్మక పాదయాత్రకు కేంద్ర హోంమంత్రి అమిత్ షా నాయకత్వం వహించనున్నారని తెలిపారు. ఆయనకు ఘనస్వాగతం పలికేందుకు బీజేపీ నాయకులు, కార్యకర్తలు, వివిధ మోర్చాల ప్రతినిధులు పూర్తి ఉత్సాహంతో సన్నద్ధమవుతున్నారని పేర్కొన్నారు.
కాంగ్రెస్ పార్టీ రాజ్యాంగబద్ధమైన సంస్థలపై నిరంతరం విమర్శలు చేస్తూ, వాటి పనితీరును ప్రశ్నించడం ద్వారా ప్రజాస్వామ్య వ్యవస్థను బలహీనపరుస్తోందని రజనీష్ జైన్ ఆరోపించారు. ప్రజాస్వామ్య విలువలు, రాజ్యాంగ స్ఫూర్తి, సంస్థల స్వతంత్రతను కాపాడాల్సిన బాధ్యత ప్రతి పౌరుడిపై ఉందన్నారు. ఈ అంశాలపై ప్రజల్లో అవగాహన కల్పించడమే పాదయాత్ర ప్రధాన ఉద్దేశమని వివరించారు.
కేంద్ర నాయకత్వం పాల్గొంటున్న ఈ కార్యక్రమం ద్వారా రాష్ట్రంలో పార్టీ కార్యకలాపాలకు మరింత ఊతం లభిస్తుందని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు. పాదయాత్రతో పాటు నిర్వహించనున్న బహిరంగ సభలో పార్టీ నాయకులు ప్రజలను ఉద్దేశించి ప్రసంగించనున్నారని తెలిపారు. హైదరాబాద్లో జరగనున్న ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేసేందుకు బీజేపీ శ్రేణులన్నీ సమన్వయంతో పనిచేస్తున్నాయని, పార్టీ నాయకులు, కార్యకర్తలు, ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొనాలని రజనీష్ జైన్ పిలుపునిచ్చారు.

