కోల్ బెల్ట్ న్యూస్(మందమర్రి);
సింగరేణి సంస్థ మందమరి ఏరియా పరిధిలో విజిలెన్స్ అవగాహన వారోత్సవాలను ఘనంగా ప్రారంభించారు. సి.ఈ.ఆర్. క్లబ్ మందమరిలో, ఆర్.కే.సి.ఓ.ఏ. క్లబ్ రామకృష్ణాపూర్‌లో, ఇల్లందు క్లబ్ మందమరిలో నిర్వహించిన ప్రారంభ కార్యక్రమాలకు మందమరి ఏరియా జనరల్ మేనేజర్ సి.ఎన్. రాధాకృష్ణ, ఏరియా సేవా అధ్యక్షురాలు శ్రీవాణి రాధాకృష్ణతో పాటు ఏరియా ఉన్నతాధికారులు హాజరై ప్రారంభించారు.
ఈ సందర్భంగా అధికారులు మాట్లాడుతూ.. కేంద్ర విజిలెన్స్ కమిషన్ (సీవీసీ) ఆదేశాల మేరకు ఈ ఏడాది ‘నిజాయితీతో సమృద్ధి’ అనే ప్రధాన నినాదంతో అక్టోబర్ 26 నుంచి నవంబర్ 1వ తేదీ వరకు మందమరి ఏరియాలోని అన్ని గనులు, విభాగాలు, కార్యాలయాల్లో విజిలెన్స్ అవగాహన వారోత్సవాలను విస్తృతంగా నిర్వహించనున్నట్లు తెలిపారు.

స్వతంత్ర భారతదేశ తొలి హోంశాఖ మంత్రి, ఉక్కు మనిషి సర్దార్ వల్లభాయ్ పటేల్ జయంతిని పురస్కరించుకొని ప్రతి సంవత్సరం విజిలెన్స్ అవగాహన వారోత్సవాలను నిర్వహించడం ఆనవాయితీగా వస్తోందని గుర్తుచేశారు. సింగరేణి సంస్థను అభివృద్ధి పథంలో ముందుకు నడిపించేందుకు ప్రతి ఒక్కరూ నిజాయితీని తమ జీవన విధానంగా అలవర్చుకోవాలని, సంస్థ అభివృద్ధికి అంకితభావంతో కృషి చేయాలని పిలుపునిచ్చారు. అనంతరం అధికారులు, ఉద్యోగులు, సిబ్బందితో కలిసి విజిలెన్స్ పౌరుల సత్యనిష్ఠ ప్రతిజ్ఞ చేశారు. ఈ కార్యక్రమాల్లో మందమరి ఏరియాకు చెందిన పలువురు ఉన్నతాధికారులు, ఉద్యోగులు, సిబ్బంది పాల్గొన్నారు.

