ఘనంగా గుండా మల్లేష్ ఆరో వర్ధంతి సభ
కోల్ బెల్ట్ న్యూస్(బెల్లంపల్లి):
అమరజీవి, దివంగత కమ్యూనిస్టు నేత కామ్రేడ్ గుండా మల్లేష్ ఆశయ సాధనకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని సీపీఐ రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు కలవేణు శంకర్, మంచిర్యాల జిల్లా కార్యదర్శి రామడుగు లక్ష్మణ్, రాష్ట్ర కంట్రోల్ కమిషన్ కార్యదర్శి మిట్టపల్లి వెంకటస్వామి పిలుపునిచ్చారు. భారత కమ్యూనిస్టు పార్టీ (సీపీఐ) బెల్లంపల్లి నియోజకవర్గం ఆధ్వర్యంలో గుండా మల్లేష్ ఆరో వర్ధంతి కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు.
ఈ సందర్భంగా పట్టణంలోని భగత్‌సింగ్ విగ్రహం వద్ద ఉన్న గుండా మల్లేష్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం పట్టణంలోని సీపీఐ కార్యాలయంలో ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. పట్టణ కార్యదర్శి ఆడెపు రాజమౌళి అధ్యక్షతన వర్ధంతి సభ నిర్వహించారు.
ఈ సభలో ముఖ్య అతిథులుగా పాల్గొన్న నాయకులు మాట్లాడుతూ.. కామ్రేడ్ గుండా మల్లేష్ కమ్యూనిస్టు పార్టీ సిద్ధాంతాలకు కట్టుబడి పేద ప్రజల సమస్యల పరిష్కారం కోసం అలుపెరుగని పోరాటాలు నిర్వహించారని గుర్తుచేశారు. దున్నేవానికే భూమి చెందాలని, భూమిలేని పేదలకు భూములు పంపిణీ చేయాలని ఉద్యమించారని తెలిపారు. లాకప్ డెత్‌లకు వ్యతిరేకంగా పోరాటాలు సాగించి ప్రజల పక్షాన నిలిచిన నాయకుడని కొనియాడారు.

సామాన్య కుటుంబంలో జన్మించిన గుండా మల్లేష్, కమ్యూనిస్టు పార్టీ సిద్ధాంతాలకు ఆకర్షితులై బాసెట్టి గంగారం, పోతుగంటి పోశెట్టి వంటి నాయకుల వద్ద రాజకీయ పాఠాలు నేర్చుకున్నారని పేర్కొన్నారు. సింగరేణి ఉద్యోగాన్ని వదిలి ప్రజాసేవ కోసం కమ్యూనిస్టు పార్టీలో చేరి అంచెలంచెలుగా ఎదిగారని తెలిపారు. సీపీఐ రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యుడిగా పనిచేయడంతో పాటు ఆసిఫాబాద్ నియోజకవర్గం నుంచి మూడుసార్లు, నూతనంగా ఏర్పడిన బెల్లంపల్లి నియోజకవర్గం నుంచి ఒకసారి ఎమ్మెల్యేగా ఎన్నికై మొత్తం నాలుగుసార్లు శాసనసభకు ప్రాతినిధ్యం వహించారని వివరించారు.
ఎమ్మెల్యేగా ఉన్న సమయంలో నియోజకవర్గంలోని అనేక ప్రజా సమస్యల పరిష్కారానికి కృషి చేశారని, పలు ప్రభుత్వ భవనాల నిర్మాణంతో పాటు బెల్లంపల్లి పట్టణంలో బస్టాండ్ నిర్మాణానికి కృషి చేశారని తెలిపారు. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాను సస్యశ్యామలం చేసేందుకు పలు ప్రాజెక్టుల నిర్మాణం కోసం, ముఖ్యంగా తుమ్మిడిహెట్టి వద్ద ప్రాజెక్టు నిర్మించాలని శాసనసభలో గళమెత్తారని గుర్తుచేశారు.
ఎలాంటి అవినీతికి తావులేకుండా నిస్వార్థంగా జీవించి, తన జీవితాన్ని చివరి శ్వాస వరకు ప్రజాసేవకే అంకితం చేసిన త్యాగశీలి గుండా మల్లేష్ అని నాయకులు పేర్కొన్నారు. ఆయన జీవితం నేటి తరానికి ఆదర్శమని, ఆయన ఆశయాలను ముందుకు తీసుకెళ్లడమే ఆయనకు అర్పించే నిజమైన నివాళి అని అన్నారు.
ఈ కార్యక్రమంలో గుండా మల్లేష్ సతీమణి గుండ సరోజన, సీపీఐ రాష్ట్ర సమితి సభ్యురాలు బొల్లం పూర్ణిమ, జిల్లా కార్యవర్గ సభ్యులు చిప్ప నరసయ్య, పట్టణ సహాయ కార్యదర్శి బొల్లం తిలక్ అంబేద్కర్, బెల్లంపల్లి మండల కార్యదర్శి బొంతల లక్ష్మీనారాయణ, మహిళా సమాఖ్య జిల్లా అధ్యక్షురాలు బొల్లం సోని, బీకేఎంయూ జిల్లా కార్యదర్శి గుండ చంద్రమణిక్యం, జిల్లా రైతు సంఘం అధ్యక్షుడు మేకల రాజేశం, జిల్లా సమితి సభ్యులు డీఆర్ శ్రీధర్, రత్నం రాజ్యం, పార్టీ నాయకులు స్వామిదాసు, కామర దుర్గయ్య, కే. తిరుపతి, జి. మహేందర్ రెడ్డి, స్వర్ణలత, చంద్రయ్య, మిట్టపల్లి మల్లేష్, శంకర్, ప్రశాంతి, రవిశంకర్‌తో పాటు గుండా మల్లేష్ కుటుంబ సభ్యులు పాల్గొన్నారు.

