కోల్ బెల్ట్ న్యూస్(బీబీపేట):
బీబీపేట మండలానికి చారిత్రక ప్రాధాన్యతతో పాటు భౌగోళికంగా ప్రత్యేక గుర్తింపు ఉందని, పెరుగుతున్న జనాభా అవసరాలను దృష్టిలో ఉంచుకుని బీబీపేటను ప్రత్యేక నియోజకవర్గంగా ప్రకటించాలని ముదిరాజ్ సంఘం కామారెడ్డి జిల్లా కార్యదర్శి కొరివి నర్సింలు ప్రభుత్వాన్ని కోరారు. ఈ సందర్భంగా కొరివి నర్సింలు మాట్లాడుతూ.. నిజాం పాలన కాలం నుంచే బీబీపేటకు ప్రత్యేక చరిత్ర ఉందన్నారు. అప్పట్లో గ్రామంలో పోలీస్ స్టేషన్ ఉండేదని, తంబలపాకుల తోట, గుల్సకట్టు గొలుసుకట్టు చెరువు వంటి చారిత్రక గుర్తింపులు ఉన్నాయని తెలిపారు. అప్పట్లో చెరువులో సుమారు ఒక టీఎంసీ నీటి నిల్వ ఉండేదని పేర్కొన్నారు.
వ్యవసాయం, పాడిపంటలు, పశుసంపదతో పాటు అనేక కుటుంబాలకు జీవనాధారంగా ఉన్న బీబీపేట ప్రాంతానికి ఘనమైన చరిత్ర ఉందన్నారు. ఇంతటి చారిత్రక నేపథ్యం కలిగిన ప్రాంతం అభివృద్ధిలో వెనుకబడకుండా ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించాలని కోరారు.బీబీపేట నుంచి సిద్దిపేట, దుబ్బాక, మెదక్, సిరిసిల్ల, కామారెడ్డి వంటి పట్టణాలు, నియోజకవర్గాలు సమీపంలో ఉన్నాయని, ఈ ప్రాంత ప్రజలకు పరిపాలనా పరమైన సౌకర్యాలు కల్పించేందుకు బీబీపేటను ప్రత్యేక నియోజకవర్గంగా ఏర్పాటు చేయడం ఎంతో అవసరమని అభిప్రాయపడ్డారు. ప్రభుత్వం జనాభా పెరుగుదల, భౌగోళిక పరిస్థితులు, చారిత్రక నేపథ్యం, ప్రజల అవసరాలను పరిగణనలోకి తీసుకుని సమగ్ర సర్వే నిర్వహించాలని విజ్ఞప్తి చేశారు. బీబీపేట చారిత్రక వైభవాన్ని గుర్తించి, ఈ ప్రాంత అభివృద్ధికి ప్రత్యేక నియోజకవర్గం ఏర్పాటు దిశగా ప్రభుత్వం చర్యలు చేపట్టాలని కొరివి నర్సింలు కోరారు.

