పరీక్షల ఒత్తిడిని అధిగమించి ఆత్మవిశ్వాసంతో ముందుకు సాగాలి
కోల్ బెల్ట్ న్యూస్(మంచిర్యాల):
ప్రపంచ మానసిక ఆరోగ్య దినోత్సవం–2026 సందర్భంగా తెలంగాణ సైకాలజిస్ట్స్ అసోసియేషన్ (టీపీఏ) మంచిర్యాల జిల్లా శాఖ ఆధ్వర్యంలో సోమవారం మంచిర్యాల పట్టణంలోని కాలేజ్ రోడ్డులో ఉన్న పద్మనాయక ఏసీ హాల్‌లో పోటీ పరీక్షలకు సిద్ధమవుతున్న అభ్యర్థుల కోసం మానసిక ఆరోగ్య అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు. కృష్ణవేణి ఎడ్యుకేషనల్ ఇన్‌స్టిట్యూషన్స్ సహకారంతో కొక్కిరాల రఘుపతిరావు చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న కోచింగ్ క్యాంపులో ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు.
ఒత్తిడిని సమర్థంగా ఎదుర్కోవాలి
ఈ సందర్భంగా విద్యార్థులకు మానసిక ఆరోగ్యం ప్రాముఖ్యత, పరీక్షల ఒత్తిడిని అధిగమించే మార్గాలు, భావోద్వేగ సమతుల్యత, ఆత్మవిశ్వాసం పెంపొందించుకునే విధానాలపై అవగాహన కల్పించారు. పరీక్షల ఒత్తిడి, ఫలితాలపై ఆందోళన, మార్కులు, ర్యాంకులపై భయం, కుటుంబ సభ్యుల అంచనాలు, ఆర్థిక ఇబ్బందులు, ఉద్యోగ సాధనలో ఎదురయ్యే సవాళ్లు విద్యార్థుల్లో మానసిక ఒత్తిడికి కారణమయ్యే అవకాశం ఉందని పేర్కొన్నారు. ఈ పరిస్థితులను సమర్థంగా ఎదుర్కొనేందుకు సమయపాలన పాటించడం, చదువుతోపాటు తగిన విశ్రాంతి తీసుకోవడం, భావోద్వేగాలను నియంత్రించుకోవడం, సానుకూల ఆలోచనా విధానాన్ని అలవర్చుకోవడం, ఆత్మవిశ్వాసంతో ముందుకు సాగడం వంటి అలవాట్లను దైనందిన జీవితంలో భాగం చేసుకోవాలని సూచించారు.
మానసిక సమస్యలను నిర్లక్ష్యం చేయొద్దు
‘మనసును వినాలి.. మార్పును తేవాలి!’ అనే సందేశంతో నిర్వహించిన ఈ కార్యక్రమంలో మానసిక ఆరోగ్య సమస్యలను అర్థం చేసుకోవడం, బాధలో ఉన్నవారి మాటలను శ్రద్ధగా వినడం, వారి అనుభవాలను గౌరవించడం, అవసరమైనప్పుడు తగిన సహాయం అందించడం వంటి అంశాలపై వివరించారు. ఆందోళన, నిరాశ, తీవ్రమైన ఒత్తిడి వంటి సమస్యలను నిర్లక్ష్యం చేయకుండా అవసరమైనప్పుడు అర్హత కలిగిన మానసిక ఆరోగ్య నిపుణులను సంప్రదించాలని సూచించారు. కౌన్సెలింగ్ తీసుకోవడం బలహీనత కాదని, అది ఆరోగ్యం పట్ల బాధ్యతాయుతమైన నిర్ణయమని స్పష్టం చేశారు.
మానసిక ఆరోగ్య ప్రతిజ్ఞ
అనంతరం విద్యార్థులతో మానసిక ఆరోగ్య ప్రతిజ్ఞ చేయించారు. ప్రతి ఒక్కరూ తమ మానసిక ఆరోగ్య పరిరక్షణ పట్ల బాధ్యతాయుతంగా వ్యవహరించాలని, ఇతరుల భావోద్వేగాలను గౌరవిస్తూ అవసరమైనప్పుడు వారికి అండగా నిలవాలని నిర్వాహకులు సూచించారు.
ఈ కార్యక్రమంలో తెలంగాణ సైకాలజిస్ట్స్ అసోసియేషన్ మంచిర్యాల జిల్లా అధ్యక్షుడు రంగు వేణు కుమార్, జిల్లా ప్రధాన కార్యదర్శి సుమన చైతన్య, రాష్ట్ర ఉపాధ్యక్షుడు బి. నారాయణరావు, టీపీఏ సలహాదారు, కృష్ణవేణి ఎడ్యుకేషనల్ ఇన్‌స్టిట్యూషన్స్ అధినేత కస్తూరి పద్మ చరణ్, గుండేటి యోగేశ్వర్, విన్నర్ ఐకాన్ కాంపిటేటివ్ ఇన్‌స్టిట్యూట్ అధినేత నాగరాజు తదితరులు పాల్గొన్నారు

