సామాజిక సమీకరణాలే కీలకం!
గవర్నర్ కోటా ఎమ్మెల్సీ పదవులపై కాంగ్రెస్‌లో పెరుగుతున్న పోటీ!
పద్మశాలి వర్గానికి ఎమ్మెల్సీ పదవి ఇస్తామని సీఎం రేవంత్‌రెడ్డి హామీ
సిరిసిల్లలో నలుగురు నేతల మధ్య తీవ్ర పోటీ
కోల్ బెల్ట్ న్యూస్ ప్రతినిధి:
తెలంగాణలో గవర్నర్ కోటా కింద ఉన్న మూడు ఎమ్మెల్సీ స్థానాలు ఈ ఏడాది నవంబర్‌లో ఖాళీ కానుండటంతో అధికార కాంగ్రెస్ పార్టీలో రాజకీయ సందడి నెలకొంది. ప్రస్తుత ఎమ్మెల్సీలు గోరటి వెంకన్న, బస్వరాజు సారయ్య, బొగ్గారపు దయానంద్‌ల పదవీకాలం ముగియనుండటంతో ఈ స్థానాలను దక్కించుకునేందుకు పలువురు కాంగ్రెస్ నేతలు ప్రయత్నాలు ముమ్మరం చేస్తున్నారు. పార్టీకి చేసిన సేవలు, సామాజిక ప్రాతినిధ్యం, రాజకీయ అనుభవం, ఉద్యమ నేపథ్యం, పార్టీ నాయకత్వంతో ఉన్న సంబంధాలు ఈ ఎంపికలో కీలకంగా మారనున్నాయి. మూడు స్థానాల కోసం ఆశావహుల సంఖ్య పెరుగుతుండటంతో కాంగ్రెస్ అధిష్ఠానం ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందన్నది. రాజకీయ వర్గాల్లో ఆసక్తికర చర్చకు దారితీస్తోంది. ముఖ్యంగా బీసీ, ఎస్సీ తదితర సామాజిక వర్గాలకు ప్రాతినిధ్యం కల్పించే అంశం ఈ ఎంపికలో ప్రాధాన్యం సంతరించుకోనుంది.
సామాజిక సమీకరణాల చుట్టూ రాజకీయాలు…..
ఇప్పటికే రెడ్డి సామాజిక వర్గానికి చెందిన ఇద్దరు నేతలకు గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ స్థానాల నుంచి పోటీ చేసే అవకాశం కల్పించిన నేపథ్యంలో, గవర్నర్ కోటా ఎమ్మెల్సీ పదవుల కోసం ఇతర సామాజిక వర్గాల నేతలు తమ ప్రయత్నాలను వేగవంతం చేస్తున్నారు. పార్టీ కోసం చేసిన కృషితో పాటు తమ సామాజిక వర్గానికి తగిన ప్రాతినిధ్యం కల్పించాలన్న వాదనను ముందుకు తీసుకొస్తున్నారు. యాదవ సామాజిక వర్గం నుంచి లైవ్‌స్టాక్ కార్పొరేషన్ ఛైర్మన్ చరణ్ కౌశిక్ యాదవ్, లోకేశ్ యాదవ్, అంజన్‌కుమార్ యాదవ్ పేర్లు వినిపిస్తుండగా, మహిళా కాంగ్రెస్ మాజీ అధ్యక్షురాలు సునీతా ముదిరాజ్ కూడా ఎమ్మెల్సీ పదవిని ఆశిస్తున్న వారిలో ఉన్నారు. బ్రాహ్మణ సామాజిక వర్గం నుంచి ప్రభుత్వ సలహాదారు హర్కర వేణుగోపాల్, హనుమకొండకు చెందిన దయాసాగర్‌రావు, పవన్ మల్లాది పేర్లు ప్రచారంలో ఉన్నాయి. ఎస్సీ సామాజిక వర్గం నుంచి మాజీ ఎమ్మెల్యే సంపత్‌కుమార్, దొమ్మాటి సాంబయ్య, మాజీ ఎంపీ, ఫైనాన్స్ కమిషన్ ఛైర్మన్ సిరిసిల్ల రాజయ్య పేర్లు పరిశీలనలో ఉన్నట్లు పార్టీ వర్గాల్లో చర్చ జరుగుతోంది.
పద్మశాలి వర్గానికి సీఎం హామీ.. ఎవరికి అవకాశం?……….
ఈ ఎమ్మెల్సీ ఎంపికలో పద్మశాలి సామాజిక వర్గానికి చెందిన నేతల మధ్య పోటీ ప్రత్యేకంగా ఆసక్తి రేపుతోంది. సిరిసిల్ల సభలో పద్మశాలి సామాజిక వర్గానికి గవర్నర్ కోటా ఎమ్మెల్సీ పదవి ఇస్తామని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ప్రకటించినట్లు ప్రచారం ఉండటంతో, ఆ హామీ తమకే వర్తిస్తుందని పలువురు నేతలు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. పద్మశాలి సామాజిక వర్గం నుంచి మాజీ ఎమ్మెల్యే ఇరవత్రి అనిల్‌కుమార్, నల్గొండ డీసీసీ అధ్యక్షుడు ఖైలాశ్ నేత, సిరిసిల్ల డీసీసీ అధ్యక్షుడు సంగీతం శ్రీనివాసరావు, పీసీసీ ఉపాధ్యక్షుడు సంగిశెట్టి జగదీశ్‌రావు పేర్లు ప్రధానంగా వినిపిస్తున్నాయి.
సిరిసిల్ల డీసీసీ అధ్యక్షుడు సంగీతం శ్రీనివాసరావు తనకు అవకాశం లభిస్తుందన్న ఆశాభావంతో ఉండగా, ముఖ్యమంత్రి, పీసీసీ నాయకత్వంతో సన్నిహిత సంబంధాలు ఉన్న మాజీ ఎమ్మెల్యే ఇరవత్రి అనిల్‌కుమార్ కూడా తనకు పదవి దక్కుతుందన్న ధీమాతో ఉన్నట్లు పార్టీ వర్గాల్లో చర్చ సాగుతోంది. మరోవైపు సంగిశెట్టి జగదీశ్‌రావు సైతం తనకు అవకాశం వస్తుందని ఆశిస్తున్నారు. స్వాతంత్య్ర సమరయోధుడు కొండా బాపూజీ కుటుంబానికి ఎమ్మెల్సీ పదవి దక్కే అవకాశముందన్న చర్చ కూడా కాంగ్రెస్ వర్గాల్లో వినిపిస్తోంది. దీంతో ముఖ్యమంత్రి ఇచ్చిన హామీ ఎవరికి వర్తించనుందన్నది ఉత్కంఠ రేపుతోంది. ఈ నలుగురిలో ఎవరికి అవకాశం లభిస్తుంది? లేక అధిష్ఠానం మరో పేరును తెరపైకి తీసుకొస్తుందా? అన్నది వేచి చూడాల్సి ఉంది.
యాదవ సామాజిక వర్గం నుంచి గట్టి ప్రయత్నాలు…….
మరోవైపు మేడ్చల్–మల్కాజిగిరి జిల్లాలో యాదవ సామాజిక వర్గానికి తగిన రాజకీయ ప్రాతినిధ్యం లేదన్న వాదనతో లైవ్‌స్టాక్ కార్పొరేషన్ ఛైర్మన్ చరణ్ కౌశిక్ యాదవ్ ఎమ్మెల్సీ పదవిని ఆశిస్తున్నట్లు సమాచారం. సామాజిక సమీకరణాలను పరిగణనలోకి తీసుకుంటే తమ వర్గానికి అవకాశం దక్కుతుందన్న అంచనాతో ఆయన ప్రయత్నాలు చేస్తున్నట్లు తెలుస్తోంది. ఖమ్మం జిల్లాకు చెందిన బీసీ నేత, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్కకు అత్యంత సన్నిహితుడిగా పేరున్న లోకేశ్ యాదవ్ కూడా ఎమ్మెల్సీ పదవిపై ఆశలు పెట్టుకున్నారు. ఉస్మానియా విశ్వవిద్యాలయం కేంద్రంగా జరిగిన ఉద్యమంలో కీలకంగా పనిచేసిన అనుభవాన్ని తనకు అనుకూల అంశంగా ఆయన భావిస్తున్నట్లు పార్టీ వర్గాల్లో చర్చ జరుగుతోంది.
అధిష్ఠానం వద్దకు ఆశావహులు………
ప్రభుత్వ సలహాదారు హర్కర వేణుగోపాల్‌రావు సైతం ఎమ్మెల్సీ పదవిని ఆశిస్తున్నట్లు సమాచారం. ఈ మేరకు ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే, ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్‌లను కలిసి తన అభ్యర్థిత్వాన్ని పరిశీలించాలని కోరినట్లు రాజకీయ వర్గాల్లో ప్రచారం సాగుతోంది. మూడు స్థానాలకు సంబంధించి ఆశావహులు తమకు ఉన్న రాజకీయ అనుభవం, పార్టీకి చేసిన సేవలు, సామాజిక వర్గాల ప్రాతినిధ్యం వంటి అంశాలను ముందుకు తెస్తున్నారు. అయితే, తుది నిర్ణయం కాంగ్రెస్ అధిష్ఠానం చేతుల్లోనే ఉండటంతో ఎవరికి అవకాశం లభిస్తుందన్న దానిపై ఉత్కంఠ కొనసాగుతోంది.
కాంగ్రెస్‌కు రాజకీయ సమతూకం పరీక్ష………
గవర్నర్ కోటా ఎమ్మెల్సీ పదవుల భర్తీ కాంగ్రెస్ పార్టీకి కేవలం నామినేషన్ల ప్రక్రియ మాత్రమే కాకుండా, వివిధ సామాజిక వర్గాలకు ప్రాతినిధ్యం కల్పించడం, పార్టీ శ్రేణుల ఆశలను సమతుల్యం చేయడం వంటి రాజకీయ సవాలుగా మారనుంది. ఒకవైపు పద్మశాలి సామాజిక వర్గానికి ఇచ్చిన హామీ, మరోవైపు యాదవ, బ్రాహ్మణ, ఎస్సీ వర్గాల నుంచి వస్తున్న డిమాండ్లు అధిష్ఠానానికి కీలకంగా మారనున్నాయి. మూడు స్థానాలకు పలువురు నేతలు పోటీ పడుతున్న నేపథ్యంలో కాంగ్రెస్ నాయకత్వం ఎలాంటి సామాజిక, రాజకీయ సమీకరణాలను అనుసరిస్తుంది? ఎవరికి అవకాశం కల్పించి ఎవరిని బుజ్జగిస్తుంది? అన్నది రాబోయే రోజుల్లో రాష్ట్ర రాజకీయాల్లో చర్చనీయాంశం కానుంది.

