NIGAMA MEDIA (P) LTD
11.4 C
Munich

NIGAMA MEDIA (P) LTD

Sunday, October 4, 2026

పట్టభద్రుల పోరులో బీఆర్ఎస్‌కు అసలైన పరీక్ష

Must read

coalbelt 24 News
coalbelt 24 Newshttps://coalbelt24news.com
COAL BELT NEWS, NIGAMA MEDIA Pvt Ltd , Mancherial, Telangana-504208, Mobile : 9603505050.

📰 Generate e-Paper Clip

రెండు కీలక ఎమ్మెల్సీ స్థానాల్లో అభ్యర్థుల ఎంపికపై మల్లగుల్లాలు..
ఉద్యమ పార్టీగా ఉన్న నాటి బలం ఇప్పుడు ఎక్కడ?
కేడర్‌ను ఏకం చేయడం నాయకత్వానికి సవాల్

కోల్ బెల్ట్ న్యూస్ ప్రతినిధి:

పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల ప్రక్రియ ఓటర్ల నమోదు దశ నుంచే తెలంగాణ రాజకీయాల్లో ఆసక్తిని రేకెత్తిస్తోంది. ముఖ్యంగా ప్రధాన ప్రతిపక్షమైన భారత రాష్ట్ర సమితి (బీఆర్ఎస్)కు ఈ ఎన్నికలు రాజకీయంగా కీలక పరీక్షగా మారుతున్నాయి. తెలంగాణ ప్రత్యేక రాష్ట్ర ఉద్యమం ఉధృతంగా సాగిన సమయంలో పట్టభద్రులు, ఉపాధ్యాయుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో బీఆర్ఎస్ అనుబంధ అభ్యర్థులు గణనీయమైన విజయాలు సాధించారు. అప్పట్లో ఉద్యోగులు, విద్యావంతులు, మేధావుల్లో పార్టీకి ఉన్న మద్దతు ఎన్నికల ఫలితాల్లో ప్రతిఫలించింది.

అయితే రాష్ట్రంలో అధికార మార్పిడి తర్వాత రాజకీయ పరిస్థితులు మారాయి. అధికారాన్ని కోల్పోయిన బీఆర్ఎస్‌కు పట్టభద్రుల వర్గాల్లో గత స్థాయిలో మద్దతు ఉందా? అన్నది ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. ఈ నేపథ్యంలో రానున్న రెండు కీలక పట్టభద్రుల నియోజకవర్గాల్లో అభ్యర్థుల ఎంపిక పార్టీ నాయకత్వానికి ప్రధాన సవాల్‌గా మారినట్లు రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతోంది.

వరంగల్-ఖమ్మం-నల్గొండపై ప్రత్యేక దృష్టి……….

గతంలో బీఆర్ఎస్ ప్రాతినిధ్యం వహించిన వరంగల్-ఖమ్మం-నల్గొండ పట్టభద్రుల నియోజకవర్గంలో పార్టీ పరిస్థితిపై నాయకత్వం ప్రత్యేకంగా దృష్టి సారించినట్లు తెలుస్తోంది. గత ఉపఎన్నికలో ఎదురైన ఫలితం పార్టీకి చేదు అనుభవాన్ని మిగిల్చింది. దీంతో ఈసారి అభ్యర్థి ఎంపిక విషయంలో ఆచితూచి వ్యవహరించాల్సిన పరిస్థితి ఏర్పడింది.

బీజేపీ నుంచి బీఆర్ఎస్‌లోకి వచ్చిన రాకేష్ రెడ్డి పేరు టికెట్ రేసులో వినిపిస్తున్నప్పటికీ, వరంగల్ ప్రాంతానికి చెందిన ఉద్యమ నేపథ్యం ఉన్న నాయకులు కూడా తమకు అవకాశం కల్పించాలని పట్టుబడుతున్నట్లు సమాచారం. ఉద్యమ కాలం నుంచి పార్టీతో ఉన్నవారికి ప్రాధాన్యం ఇవ్వాలన్న డిమాండ్ ఒకవైపు ఉండగా.. ఎన్నికల్లో సామాజిక, ఆర్థిక, వ్యక్తిగత పరిచయాలు కలిగిన బలమైన అభ్యర్థినే ఎంపిక చేయాలన్న అభిప్రాయం మరోవైపు వినిపిస్తోంది. ఈ రెండు అంశాల మధ్య సమతుల్యత సాధించడం బీఆర్ఎస్ నాయకత్వానికి సవాల్‌గా మారినట్లు పార్టీ వర్గాల్లో చర్చ జరుగుతోంది.

హైదరాబాద్ స్థానంలోనూ సందిగ్ధత………

హైదరాబాద్-రంగారెడ్డి-మహబూబ్‌నగర్ పట్టభద్రుల నియోజకవర్గంలో పరిస్థితి మరింత ఆసక్తికరంగా మారింది. ఐటీ ఉద్యోగులు, యువత, పట్టభద్రులు పెద్ద సంఖ్యలో ఉన్న ఈ నియోజకవర్గంలో పార్టీ తరఫున ఎవరిని బరిలోకి దించాలన్న అంశంపై ఇంకా స్పష్టత రావాల్సి ఉంది.

గతంలో సురభి వాణీదేవిని బరిలోకి దించి పీవీ నరసింహారావు కుటుంబ నేపథ్యం, సెంటిమెంట్‌ను పార్టీ ప్రచారంలో ప్రధానంగా ఉపయోగించుకుంది. అయితే ఈసారి అదే తరహా వ్యూహం ఎంతవరకు ఫలిస్తుందన్నది చర్చనీయాంశంగా మారింది. మరోవైపు బీజేపీ, కాంగ్రెస్ తమ తమ రాజకీయ, సంస్థాగత నెట్‌వర్క్‌లను విస్తరిస్తున్న నేపథ్యంలో బీఆర్ఎస్‌కు బలమైన అభ్యర్థిని ఎంపిక చేయడం కీలకంగా మారింది.

అభ్యర్థి ఎంపికపైనే రాజకీయ భవిష్యత్తు?……..

పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికలను బీఆర్ఎస్ కేవలం ఒక ఎన్నికగా కాకుండా, పార్టీకి ఉన్న ప్రస్తుత రాజకీయ బలం, పట్టభద్రులు–ఉద్యోగుల్లో ఉన్న మద్దతును అంచనా వేసే సందర్భంగా చూడాల్సి ఉంటుందని రాజకీయ పరిశీలకులు పేర్కొంటున్నారు.

ఎన్నికల్లో గెలుపు సాధించడమే కాకుండా, ప్రధాన ప్రత్యర్థులకు గట్టి పోటీ ఇవ్వడం కూడా పార్టీ రాజకీయ స్థితిగతులపై ప్రభావం చూపే అంశంగా మారనుంది. ముఖ్యంగా యువత, ఉద్యోగులు, విద్యావంతుల్లో పార్టీకి ఉన్న మద్దతుపై ఈ ఫలితాలు చర్చకు దారితీసే అవకాశం ఉంది.

ఇప్పటికే వరుస ఎన్నికల ఫలితాలతో సవాళ్లు ఎదుర్కొంటున్న బీఆర్ఎస్‌కు పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికలు మరో కీలక రాజకీయ పరీక్షగా మారుతున్నాయి. అభ్యర్థుల ఎంపిక, క్షేత్రస్థాయి కేడర్ సమన్వయం, పట్టభద్రుల వర్గాలను ఆకర్షించే ప్రచార వ్యూహం.. ఈ మూడు అంశాలపైనే పార్టీ ప్రదర్శన ఆధారపడనుంది.

More articles

Latest article

App Icon

Install CBN News App

Add to home screen for faster loading and latest updates.