దసరాకు ముందే పట్టాలు ఇవ్వాలని డిమాండ్.. లేకుంటే నిరాహార దీక్షలు, ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయ ముట్టడి
బెల్లంపల్లి: లక్కీ డ్రాలో డబుల్ బెడ్‌రూం ఇళ్లు మంజూరైన లబ్ధిదారులకు వెంటనే పట్టాలు అందించి, ఇళ్లను అప్పగించాలని ఎంసీపీఐయూ పార్టీ జిల్లా సహాయ కార్యదర్శి పసులేటి వెంకటేష్ డిమాండ్ చేశారు. బెల్లంపల్లిలోని ఎంసీపీఐయూ పార్టీ కార్యాలయంలో నిర్వహించిన ముఖ్య కార్యకర్తల సమావేశంలో ఆయన మాట్లాడారు.
లక్కీ డ్రాలో డబుల్ బెడ్‌రూం ఇల్లు వచ్చిందన్న ఆనందం లబ్ధిదారుల కళ్లలో కనిపించిందని, “ఈ దసరా పండుగను మన సొంతింట్లోనే జరుపుకుంటాం” అని వారు ఎన్నో ఆశలు పెట్టుకున్నారని తెలిపారు. అయితే రోజులు గడుస్తున్నా పట్టాలు అందకపోవడంతో వారి ఆనందం ఆవేదనగా మారుతోందన్నారు.
“ఇల్లు వచ్చిందని సంతోషపడాలా.. పట్టా రాలేదని బాధపడాలా? దసరా పండుగకు కొత్త ఇంట్లో దీపాలు వెలిగిస్తామా.. లేక కిరాయి ఇంట్లోనే పండుగ జరుపుకోవాల్సి వస్తుందా?” అంటూ లబ్ధిదారులు ఆందోళన చెందుతున్నారని పేర్కొన్నారు.
పేదల సొంతింటి కలను కాగితాలకే పరిమితం చేయకుండా, లబ్ధిదారుల చేతికి పట్టాలు అందించి సాకారం చేయాలని కోరారు. ఎమ్మెల్యే, సంబంధిత అధికారులు స్పందించి లబ్ధిదారుల సమస్యను అర్థం చేసుకుని దసరా పండుగకు ముందే పట్టాలు అందించాలని డిమాండ్ చేశారు.
లక్కీ డ్రాలో ఎంపికైన అర్హులైన లబ్ధిదారులందరికీ డబుల్ బెడ్‌రూం ఇళ్లు అందించకపోతే, లబ్ధిదారులను కలుపుకుని కాంట చౌరస్తాలో నిరాహార దీక్షలు చేపట్టడంతో పాటు ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయాన్ని ముట్టడిస్తామని వెంకటేష్ హెచ్చరించారు.
ఈ సమావేశంలో బెల్లంపల్లి పట్టణ కార్యదర్శి ఆరెపల్లి రమేష్, బెల్లంపల్లి మండల కార్యదర్శి తోగరి రాహుల్, శంభోజి రాజేష్, శివ, రాకేష్ తదితరులు పాల్గొన్నారు.

