సెప్టెంబర్ 11 నుంచి 17 వరకు సీపీఐ ఆధ్వర్యంలో వారోత్సవాలు
బెల్లంపల్లిలో భగత్‌సింగ్ విగ్రహం వద్ద జెండా ఆవిష్కరణ
కోల్ బెల్ట్ న్యూస్ (బెల్లంపల్లి):
తెలంగాణ రైతాంగ సాయుధ పోరాటం 70వ వార్షికోత్సవాలను పురస్కరించుకుని సెప్టెంబర్ 11 నుంచి 17వ తేదీ వరకు సీపీఐ మంచిర్యాల జిల్లా సమితి ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న జాతాలో భాగంగా బెల్లంపల్లి పట్టణంలో సోమవారం కార్యక్రమం నిర్వహించారు. భగత్‌సింగ్ విగ్రహం వద్ద జరిగిన ఈ కార్యక్రమానికి సీపీఐ బెల్లంపల్లి పట్టణ కార్యదర్శి ఆడెపు రాజమౌళి అధ్యక్షత వహించారు. పార్టీ జెండాను సీపీఐ మంచిర్యాల జిల్లా కార్యదర్శి రామడుగు లక్ష్మణ్ ఆవిష్కరించారు. అనంతరం జాతా నాయకులు మేకల దాస్, రేగుంట చంద్రశేఖర్, సీపీఐ బెల్లంపల్లి నియోజకవర్గ కార్యదర్శి దాగం మల్లేష్, సీనియర్ నాయకులు చిప్ప నరసయ్యలు భగత్‌సింగ్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు.
ఈ సందర్భంగా దాగం మల్లేష్ మాట్లాడుతూ.. నిజాం నిరంకుశ పాలన, దొరలు, జమీందారుల దోపిడీ, దౌర్జన్యాలు, వెట్టిచాకిరీకి వ్యతిరేకంగా ఆంధ్ర మహాసభ, కమ్యూనిస్టు పార్టీలు ప్రజల్లో చైతన్యం కల్పించడంతో తెలంగాణ ప్రజలు తిరుగుబాటు చేశారని తెలిపారు. విసునూరు దొర దుర్మార్గాలకు వ్యతిరేకంగా సాగిన పోరాటంలో గుండాల కాల్పులకు బలై దొడ్డి కొమురయ్య తొలి అమరుడిగా నిలిచారని పేర్కొన్నారు. తెలంగాణ రైతాంగ సాయుధ పోరాటంలో ఆదిలాబాద్ ప్రాంతానికి చెందిన దాది శంకర్రావు, రామకృష్ణ శాస్త్రి, కష్టాల రామకృష్ణ, బాసెట్టి గంగారం, పోతుగంటి పోశెట్టి, జె. కుమారస్వామి తదితరులు పాల్గొని నిజాం నిరంకుశ పాలనతో పాటు దొరలు, జమీందారుల దోపిడీ, దౌర్జన్యాలు, వెట్టిచాకిరీకి వ్యతిరేకంగా పోరాడారని తెలిపారు.
తెలంగాణ రైతాంగ సాయుధ పోరాటాన్ని హిందువులు, ముస్లింలకు మధ్య జరిగిన పోరాటంగా చిత్రీకరిస్తూ కొన్ని మతోన్మాద శక్తులు తప్పుడు ప్రచారం చేస్తున్నాయని మల్లేష్ విమర్శించారు. వాస్తవ చరిత్రను ప్రజలు తెలుసుకోవాలని, చరిత్రను వక్రీకరించే ప్రయత్నాలను తిప్పికొట్టాలని ఆయన కోరారు. కర్ణాటక, మహారాష్ట్ర ప్రభుత్వాలు సెప్టెంబర్ 17వ తేదీని అధికారికంగా విమోచన దినోత్సవంగా నిర్వహిస్తున్నాయని, అదే విధంగా తెలంగాణ ప్రభుత్వం కూడా సెప్టెంబర్ 17ను అధికారికంగా నిర్వహించాలని ఆయన డిమాండ్ చేశారు.
ఈ కార్యక్రమంలో బీకేఎంయూ జాతీయ సమితి సభ్యులు అక్కపెల్లి బాపు, సీపీఐ జిల్లా సమితి సభ్యులు బొంతుల లక్ష్మీనారాయణ, గుండా చంద్రమాణిక్యం, మేకల రాజేశం, రత్నం రాజ్యం, వనం సత్యనారాయణ, దాసరి తిరుపతిగౌడ్, బియ్యాల ఉపేందర్, స్వామిదాస్, కామెర దుర్గయ్య, బండారి శంకర్, ఉప్పుల శంకర్, మహేందర్‌రెడ్డి, కే. తిరుపతి, రమణతో పాటు ప్రజానాట్యమండలి సభ్యులు, పార్టీ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.

