కోల్ బెల్ట్ న్యూస్(మందమర్రి):
యువతలో ఆత్మవిశ్వాసం, క్రమశిక్షణ, శారీరక దృఢత్వంతో పాటు ఆత్మరక్షణ నైపుణ్యాలను పెంపొందించడమే లక్ష్యంగా BMR Karate Do Martial Arts Academy ఆధ్వర్యంలో ఈ నెల 23న మందమర్రిలో ప్రత్యేక కార్యక్రమాన్ని నిర్వహించనున్నట్లు నిర్వాహకులు తెలిపారు. మందమర్రిలోని శ్రీ లక్ష్మీ భవాని ఫంక్షన్ హాల్‌లో నిర్వహించనున్న ఈ కార్యక్రమానికి చీఫ్ ఆర్గనైజర్ వెల్పుల వినయ్ మాస్టర్ నేతృత్వం వహించనున్నారు. BMR ఫౌండర్ బండారి సంతోష్, అకాడమీ కర్ర వెంకటేష్, జనరల్ సెక్రటరీ మామిడి శశికిరణ్ తదితరుల సమన్వయంతో ఏర్పాట్లు చేస్తున్నారు.

ఈ సందర్భంగా నిర్వాహకులు మాట్లాడుతూ కరాటే కేవలం క్రీడ మాత్రమే కాదని, విద్యార్థుల్లో క్రమశిక్షణ, ధైర్యం, ఆత్మవిశ్వాసం, ఆత్మరక్షణ నైపుణ్యాలను పెంపొందించే గొప్ప విద్య అని పేర్కొన్నారు. ప్రస్తుత పరిస్థితుల్లో చిన్నారులు, యువత మార్షల్ ఆర్ట్స్ నేర్చుకోవడం ఎంతో అవసరమని అన్నారు. కార్యక్రమంలో BMR అకాడమీ విద్యార్థులు కరాటే, మార్షల్ ఆర్ట్స్, ఆత్మరక్షణకు సంబంధించిన ప్రత్యేక ప్రదర్శనలు నిర్వహించనున్నారు. విద్యార్థులు సాధించిన నైపుణ్యాలను తల్లిదండ్రులు, ప్రజల సమక్షంలో ప్రదర్శించేందుకు ఈ కార్యక్రమం మంచి వేదికగా నిలుస్తుందని నిర్వాహకులు తెలిపారు.
పిల్లల్లో దాగి ఉన్న ప్రతిభను వెలికితీసి, వారిని భవిష్యత్తులో ఉన్నత స్థాయికి తీసుకెళ్లడమే BMR అకాడమీ లక్ష్యమని చీఫ్ ఆర్గనైజర్ వెల్పుల వినయ్ తెలిపారు. తల్లిదండ్రులు తమ పిల్లలను క్రీడలు, మార్షల్ ఆర్ట్స్ వైపు ప్రోత్సహించాలని కోరారు. విద్యార్థుల ప్రతిభను ప్రోత్సహించే ఈ కార్యక్రమానికి తల్లిదండ్రులు, యువత, క్రీడాభిమానులు, ప్రజలు పెద్ద సంఖ్యలో హాజరై విజయవంతం చేయాలని నిర్వాహకులు విజ్ఞప్తి చేశారు.

