కోల్ బెల్ట్ న్యూస్ ప్రతినిధి:
ప్రపంచంలోనే అతిపెద్ద రవాణా వ్యవస్థల్లో భారతీయ రైల్వే ఒకటి. ప్రతిరోజూ కోట్లాది మంది ప్రయాణికులు రైళ్లలో తమ గమ్యస్థానాలకు చేరుకుంటుంటారు. భారతీయ రైల్వేలో వందలాది రైళ్లు నడుస్తున్నప్పటికీ, ఒడిశా సంపర్క్ క్రాంతి ఎక్స్‌ప్రెస్ (రైలు నంబర్లు 12820/12819) ప్రత్యేక గుర్తింపు పొందింది. ఈ రైలు బీహార్ రాష్ట్రంలోని 70కి పైగా రైల్వే స్టేషన్లను దాటినా ఒక్క స్టేషన్లో కూడా ఆగదు. ఢిల్లీలోని ఆనంద్ విహార్ టెర్మినల్ నుంచి భువనేశ్వర్ వరకు నడిచే ఈ రైలు (12820), తిరుగు ప్రయాణంలో 12819 నంబర్‌తో భువనేశ్వర్ నుంచి ఆనంద్ విహార్‌కు చేరుకుంటుంది. సుమారు 1,782 కిలోమీటర్ల దూరాన్ని 28 గంటల 30 నిమిషాల్లో పూర్తి చేస్తుంది.
ఈ రైలు ఢిల్లీ, ఉత్తరప్రదేశ్, బీహార్, జార్ఖండ్, పశ్చిమ బెంగాల్, ఒడిశా రాష్ట్రాల మీదుగా ప్రయాణిస్తుంది. మొత్తం మార్గంలో కేవలం 13 ప్రధాన రైల్వే స్టేషన్లలో మాత్రమే నిలుస్తుంది. పండిట్ దీన్‌దయాళ్ ఉపాధ్యాయ జంక్షన్ దాటిన తర్వాత బీహార్‌లోకి ప్రవేశించే ఈ రైలు ససారం, గయా, మన్పూర్ వంటి ముఖ్యమైన స్టేషన్లను దాటుకుంటూ వెళ్లినా ఎక్కడా ఆగదు. దీంతో బీహార్‌లోని 70కిపైగా స్టేషన్లను నిరవధికంగా దాటేసి ముందుకు సాగుతుంది.
దీనికి ప్రధాన కారణం ప్రయాణ సమయాన్ని తగ్గించడం. ప్రతి స్టేషన్లో రైలును ఆపితే గమ్యస్థానానికి చేరుకునే సమయం గణనీయంగా పెరుగుతుంది. అందుకే ఈ రైలును పరిమిత హాల్టులతో నడుపుతూ, దూర ప్రయాణికులు తక్కువ సమయంలో గమ్యస్థానానికి చేరుకునేలా భారతీయ రైల్వే ప్రణాళిక రూపొందించింది. దీంతో ఒడిశా సంపర్క్ క్రాంతి ఎక్స్‌ప్రెస్ భారతీయ రైల్వేలో అత్యంత వేగవంతమైన, ప్రత్యేక సేవలందించే రైళ్లలో ఒకటిగా నిలిచింది

