సింగరేణి పరిరక్షణ కోసం ఉద్యమాలు
మణుగూరు డిప్‌సైడ్ బొగ్గు బ్లాక్‌ను సింగరేణికే కేటాయించాలి
ఐఎన్‌టీయూసీ సెంట్రల్ సీనియర్ ఉపాధ్యక్షుడు కాంపెళ్లి సమ్మయ్య డిమాండ్
కోల్ బెల్ట్ న్యూస్(మందమర్రి):
సింగరేణి పరిరక్షణ కోసం తమ యూనియన్ ఉద్యమాలు చేపడుతుందని ఐఎన్‌టీయూసీ సెంట్రల్ సీనియర్ ఉపాధ్యక్షుడు కాంపెళ్లి సమ్మయ్య స్పష్టం చేశారు. శనివారం మందమర్రి ఏరియా జనరల్ మేనేజర్ కార్యాలయం ఎదుట ఐఎన్‌టీయూసీ ఆధ్వర్యంలో ధర్నానిర్వహించారు.ఈ సందర్భంగా జీఎం రాధాకృష్ణ కు వినతి పత్రం ఇచ్చిన అనంతం ఆయన ధర్నాను ఉద్దేశించి మాట్లాడుతూ, కేంద్ర ప్రభుత్వం 2015లో తీసుకొచ్చిన ఎన్‌ఎండీఆర్ (NMDR) చట్టానికి అప్పటి బీఆర్‌ఎస్ ప్రభుత్వం, టీజీబీకేఎస్ సంఘం మద్దతు పలికాయని విమర్శించారు. కార్మికుల పక్షపాతి అని చెప్పుకున్న బీఆర్‌ఎస్ ప్రభుత్వం, టీజీబీకేఎస్ సంఘం పదేళ్ల పాలనలో ఒక్క కొత్త బొగ్గు గనినైనా ఎందుకు ప్రారంభించలేదని ప్రశ్నించారు.
కేంద్ర ప్రభుత్వం బొగ్గు బ్లాక్‌లను వేలానికి పెట్టిన సమయంలో వాటిని అడ్డుకునేందుకు ఎలాంటి చర్యలు తీసుకోకుండా, తమకు అనుకూలమైన సంస్థలు, ప్రైవేటు కంపెనీలకు కట్టబెట్టే ప్రయత్నాలు బిఆర్ఎస్ హయాంలో జరిగాయని ఆరోపించారు. దీనివల్ల సింగరేణి భవిష్యత్తు ప్రమాదంలో పడిందని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. ఒకవైపు బొగ్గు గనులు మూతపడుతుండటంతో సింగరేణి ప్రాంతంలో నిరుద్యోగం పెరుగుతోందని ఆవేదన వ్యక్తం చేశారు. యాజమాన్యం మెడికల్ అన్‌ఫిట్‌లు, వారసత్వ ఉద్యోగాలపై పొంతనలేని ప్రకటనలు చేస్తున్ననేపథ్యంలో కార్మికులు, వారి కుటుంబాలు తీవ్ర అయోమయంలో ఉన్నాయని పేర్కొన్నారు. సింగరేణికి పూర్వ వైభవం తీసుకురావడానికి ఐఎన్‌టీయూసీ భవిష్యత్తులో ఏ త్యాగానికైనా సిద్ధంగా ఉంటుందన్నారు.

సింగరేణిని సెంట్రల్ పబ్లిక్ అండర్‌టేకింగ్ స్టేటస్ పరిధిలోకి తీసుకురావాలని డిమాండ్ చేశారు. అలా చేస్తే ఎలాంటి షరతులు లేకుండా బొగ్గు గనులను సింగరేణికి కేటాయించే అవకాశం ఉంటుందని తెలిపారు. ఈ అంశంపై కేంద్ర మంత్రి కిషన్ రెడ్డిని కలిసి వినతిపత్రం అందజేశామని, సింగరేణి పరిరక్షణకు తన వంతు సహకారం అందిస్తానని ఆయన హామీ ఇవ్వడం జరిగిందన్నారు. సింగరేణికి కొత్త బొగ్గు గనులు కేటాయించకపోతే రాష్ట్రవ్యాప్తంగా ఐఎన్‌టీయూసీ ఆధ్వర్యంలో ఆందోళనలు మరింత ఉద్ధృతం చేస్తామని హెచ్చరించారు. మణుగూరు డిప్‌సైడ్ బొగ్గు బ్లాక్‌ను సింగరేణికే కేటాయించాలని సమ్మయ్య ఈ సందర్బంగ డిమాండ్ చేశారు. ఈ మహాధర్నాలో ఐఎన్‌టీయూసీ సెంట్రల్ నాయకులు శంకర్‌రావు, రాపర్తి శ్రీనివాస్, ఏరియా ఉపాధ్యక్షుడు భూమయ్య, ఏరియా నాయకులు, ఫిట్ కమిటీ కార్యదర్శులు, కార్మికవర్గం పాల్గొన్నారు.

