19.4 C
Munich
Sunday, August 2, 2026

భద్రాచలానికి రైల్వే శోభ

Must read

coalbelt 24 News
coalbelt 24 Newshttps://coalbelt24news.com
COAL BELT NEWS, NIGAMA MEDIA Pvt Ltd , Mancherial, Telangana-504208, Mobile : 9603505050.

📰 Generate e-Paper Clip

అత్యాధునిక ప్రమాణాలతో కొత్త రైలు మార్గం
పాండురంగాపురం–భద్రాచలం–మల్కన్‌గిరి మధ్య 173.6 కి.మీ రైల్వే లైన్
గంటకు 160 కి.మీ వేగంతో రైళ్లకు అనుకూలంగా నిర్మాణం
లెవల్ క్రాసింగ్‌లు లేకుండా 300కుపైగా వంతెనలు
41 ఆర్వోబీలు, 66 ఆర్‌యూబీలు •
రూ.2,864 కోట్లతో ప్రత్యేక రైల్వే ప్రాజెక్టు

కోల్ బెల్ట్ న్యూస్(భద్రాచలం):

భద్రాచల శ్రీ సీతారామచంద్ర స్వామి పుణ్యక్షేత్రాన్ని తొలిసారిగా భారత రైల్వే మ్యాప్‌లో చేర్చే లక్ష్యంతో చేపట్టిన పాండురంగాపురం–భద్రాచలం–మల్కన్‌గిరి రైల్వే ప్రాజెక్టును అత్యాధునిక ప్రమాణాలతో నిర్మించేందుకు రైల్వే శాఖ ప్రణాళిక రూపొందించింది. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, ఒడిశా రాష్ట్రాలను అనుసంధానించే ఈ రైల్వే మార్గం మొత్తం 173.6 కిలోమీటర్ల పొడవుతో నిర్మించనున్నారు.

ఈ ప్రాజెక్టును భవిష్యత్ అవసరాలను దృష్టిలో ఉంచుకుని గంటకు 160 కిలోమీటర్ల వేగంతో రైళ్లు ప్రయాణించేలా డిజైన్ చేశారు. మొత్తం ప్రాజెక్టు వ్యయం రూ.2,864 కోట్లుగా అంచనా వేశారు.

ఈ రైల్వే మార్గంలో ఎక్కడా లెవల్ క్రాసింగ్‌లు ఉండవు. ప్రయాణికుల భద్రతకు అత్యంత ప్రాధాన్యం ఇస్తూ 300కు పైగా వంతెనలు, 41 రోడ్ ఓవర్ బ్రిడ్జిలు (ఆర్వోబీలు), 66 రోడ్ అండర్ బ్రిడ్జిలు (ఆర్‌యూబీలు) నిర్మించనున్నారు. దీంతో రహదారి–రైల్వే రాకపోకలు అంతరాయం లేకుండా సాగనున్నాయి.

ప్రాజెక్టు అమలుకు తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, ఒడిశా రాష్ట్రాల పరిధిలో కలిపి 843.9 హెక్టార్ల భూమి సేకరించాల్సి ఉంటుందని రైల్వే శాఖ గుర్తించింది. భూమి సేకరణ ప్రక్రియ పూర్తయిన అనంతరం నిర్మాణ పనులు వేగవంతం కానున్నాయి.

భద్రాచలం వంటి ప్రముఖ ఆధ్యాత్మిక క్షేత్రానికి తొలిసారిగా ప్రత్యక్ష రైల్వే అనుసంధానం కల్పించనున్న ఈ ప్రాజెక్టును కేంద్ర ప్రభుత్వం ప్రత్యేక రైల్వే ప్రాజెక్టుగా గుర్తించింది. ఈ రైల్వే మార్గం పూర్తయితే భక్తులతో పాటు ఏజెన్సీ ప్రాంత ప్రజలకు మెరుగైన రవాణా సౌకర్యం లభించడంతో పాటు తెలంగాణ–ఆంధ్రప్రదేశ్–ఒడిశా మధ్య వాణిజ్య, పర్యాటక, ఆర్థిక కార్యకలాపాలకు కూడా కొత్త ఊతం లభించనుంది.

More articles

Latest article

App Icon

Install CBN News App

Add to home screen for faster loading and latest updates.