ఐదు ఉపరితల గనుల్లో ఉత్పత్తి నిలిచివేత
ఒక్కరోజే సుమారు 29 వేల టన్నుల బొగ్గు ఉత్పత్తి నష్టం
గనుల్లోకి చేరిన వరద నీటిని తొలగించే పనుల్లో అధికారులు
కోల్ బెల్ట్ న్యూస్ ప్రతినిధి:
మంచిర్యాల, కుమురం భీం ఆసిఫాబాద్ జిల్లాల్లో కురుస్తున్న ఎడతెరిపి లేని భారీ వర్షాల ప్రభావంతో సింగరేణి ఓపెన్‌కాస్ట్ గనుల్లో బొగ్గు ఉత్పత్తికి తీవ్ర అంతరాయం ఏర్పడింది. మంగళవారం రాత్రి నుంచి బుధవారం వరకు కురిసిన భారీ వర్షాల కారణంగా ఓపెన్‌కాస్ట్ ప్రాజెక్టుల్లోకి పెద్ద ఎత్తున వరద నీరు చేరడంతో బుధవారం ఉత్పత్తి పూర్తిగా నిలిచిపోయింది. ఈ రెండు జిల్లాల్లోని మూడు ఏరియాల పరిధిలో మొత్తం ఐదు ఉపరితల గనులు ఉన్నాయి. వర్షాల ప్రభావంతో ఒక్కరోజే సుమారు 29,000 టన్నుల బొగ్గు ఉత్పత్తి నష్టం వాటిల్లినట్లు అధికారులు అంచనా వేస్తున్నారు.
ప్రాంతాల వారీగా చూస్తే, మందమర్రి ఏరియాలో 6,407 టన్నులు, శ్రీరాంపూర్ ఏరియాలో 15,220 టన్నులు, బెల్లంపల్లి ఏరియాలో 7,400 టన్నుల బొగ్గు ఉత్పత్తి నిలిచిపోయింది. గనుల్లోని పని ప్రదేశాల్లో నిల్వైన వర్షపు నీటిని బయటకు పంపేందుకు అధికారులు యుద్ధప్రాతిపదికన చర్యలు చేపట్టారు. అధిక సామర్థ్యం గల మోటార్లను ఏర్పాటు చేసి నిరంతరాయంగా నీటిని వెలుపలికి పంపిస్తున్నారు. వర్షాలు కొనసాగితే మరింత నీరు గనుల్లోకి చేరే అవకాశం ఉండటంతో అవసరమైన ముందస్తు జాగ్రత్తలు తీసుకుంటున్నారు. పరిస్థితులు సాధారణ స్థితికి చేరుకున్న వెంటనే బొగ్గు ఉత్పత్తిని పునరుద్ధరించేందుకు సింగరేణి అధికారులు చర్యలు వేగవంతం చేశారు.

