mla : నియోజకవర్గం అభివృద్ధి. మరోవైపు నియోజకవర్గంలో శాంతి భద్రతలు. ఇవి రెండు కూడా ఏ ఎమ్మెల్యేకు అయినా తప్పనిసరి. ఈ రెండింటిని రైల్ పట్టాలుగా భావించాల్సిందే. వీటిలో ఏ ఒక్కటి సక్రమంగా లేకపోయినా ఆ నాయకుడు ప్రజలకు దూరం కావడం ఖాయం. అభివృద్ధి అనేది కొంతవరకు వెనుక, ముందు కావచ్చు. కానీ నియోజకవర్గంలో శాంతి భద్రతలు అదుపుతప్పితే మాత్రం ప్రజల్లో నాయకుడు కూడా పట్టుతప్పిపోతాడు. అందుకనే మంచిర్యాల నియోజక వర్గం ఎమ్మెల్యే కొక్కిరాల ప్రేమ్ సాగర్ రావ్ నియోజకవర్గం అభివృద్ధి తోపాటు శాంతి భద్రతలపై దృష్టి సారించారు.
రెండు రోజుల కిందటనే సంబంధిత శాఖకు చెందిన ఒక అధికారితో ఎమ్మెల్యే ప్రేమ్ సాగర్ రావ్ శాంతి భద్రత గురించి మాట్లాడినట్టు పార్టీ వర్గాల సమాచారం. మంచిర్యాల జిల్లా కేంద్రంలో మీరు ఏమి చేస్తారో నాకు తెలియదు. ప్రజలు ఆరోగ్యకరమైన వాతావరణంలో ఆనందంగా ఉండాలి. శాంతి భద్రతలు అదుపులో ఉండాలి. డ్రగ్స్, గంజాయి కనబడరాదు. రాత్రి పది గంటల వరకే బ్రాందీ షాపులు, హోటళ్లు నడిపే విదంగా చర్యలు తీసుకోవాలి. పది గంటల తరువాత రోడ్ల పై తాగి కనబడితే చట్ట ప్రకారం వెళ్ళండి. బైక్ రైడింగ్ పై కఠినంగా ఉండండి. కొందరు సైలెన్సర్ తీసి బైకులు నడుపుతున్నారు. వాటిని అదుపు చేయండి. ఇదంతా కూడా మా పార్టీ నాయకుల ముందే ఎందుకు చెబుతున్నాను అంటే, మీ పరిపాలనలో మా నాయకులు కూడా జోక్యం చేసుకోరు. ఒకవేళ ఎవరైనా మీకు ఫోన్ చేసి, మావాడే వదిలేయండి అంటే ఎట్టి పరిస్థితుల్లో వినకండి.
ఎవరైనా విద్యార్థులు తాగి ప్రజలను ఇబ్బంది పెట్టడం, అల్లరి చేసిన నేపథ్యంలో కేసులు పెట్టకండి. రెండు, మూడు రోజులు పోలీస్ స్టేషన్లో ఉంచండి. తల్లిదండ్రులను పిలిపించి కౌన్సిలింగ్ ఇవ్వండి. పదకొండు దాటితే మీ పని మీరు చేయండి. ఎవరు అడ్డు వచ్చినా వినకండి. ఎట్టి పరిస్థితుల్లో కూడా శాంతి భద్రతల విషయంలో రాజీ పడకండి అంటూ సంభందిత అధికారికి ఎమ్మెల్యే ప్రేమ్ సాగర్ రావ్ ఆదేశాలు ఇచ్చినట్టు విశ్వసనీయ వర్గాల సమాచారం. మంచిర్యాల జిల్లా కేంద్రాన్ని ఆరోగ్యకరమైన వాతావరణంలో నిలపడానికి ఎమ్మెల్యే ప్రేమ్ సాగర్ రావ్ ఆదేశాలు ఇవ్వడంతో ప్రజలు ఆనందం వ్యక్తం చేస్తున్నారు.