Politics : తెలంగాణ రాజకీయాల్లో బలమైన నేతలు తోటి నేతలపై ప్రకంపనలు సృష్టిస్తున్నారు. ఈ ప్రకంపనలు సృష్టించేవారు పార్టీ గడప దాటి వెళ్ళలేరు. పార్టీ నియమాలకు కట్టుబడి ఉండలేరు. కంటిలోని నలుసు మాదిరిగా పార్టీకి ఇబ్బంది పెడుతుంటారు. మీడియా ఎదుట పార్టీకి నష్టం కలిగించే విధంగా ప్రవర్తించినప్పటికీ పార్టీ పెద్దలు ప్రేక్షక పాత్రను పోషించడం విశేషం.
బిజెపి లో బండి సంజయ్, ఈటల రాజేందర్ మధ్య పచ్చగడ్డి వేస్తె బగ్గుమనే పరిస్థితి నెలకొంది. ఒకరిని మించి ఒకరు కాలు దువ్వుతున్నారు. ఇద్దరి మాటల యుద్ధం ఢిల్లీ వరకు వెళ్ళింది. బండి సంజయ్ ఏబీవీపీ నుంచి వచ్చిన నాయకుడు. ఈటల రాజేందర్ తెలంగాణ రాజకీయాలపై సంపూర్ణమైన అవగాహన ఉన్నవ్యక్తి. పార్టీకి బలమైన నాయకులు అవసరం. ప్రస్తుత పరిస్థితుల్లో ఏ ఒక్కరిని పార్టీ పోగొట్టుకోలేదు.
బిఆర్ఎస్ లో ఎమ్మెల్సీ కవిత దూకుడు మాములుగా లేదు. ఆమె నేరుగా రక్త సంబంధంతోనే రాజకీయ యుద్ధం చేస్తున్నారు. మా నాయకుడు కేసీఆర్, పార్టీ గౌరవ అధ్యక్షుడు కేటిఆర్ అంటూనే ప్రకంపనలు సృష్టిస్తున్నారు. పార్టీ కంటే ముందుగానే ఆమె కాంగ్రెస్ ప్రభుత్వం పై ప్రజాసమస్యలపై పోరాటం చేస్తున్నారు. బీసీ రిజర్వేషన్ ఆర్డినెన్స్ విషయంలో ఆమె మాట్లాడిన మాటలు ప్రభుత్వానికి మద్దతుగా నిలిచాయి. ఈ విషయం కూడా బిఆర్ఎస్ కు తలనొప్పిగా మారింది.
పదేళ్లు నేనే ముఖ్యమంత్రిగా ఉంటాను అంటూ సీఎం చేసిన వ్యాఖ్యలపై కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి తన కడుపులో ఉన్న ఆవేదనను మరో రూపకంగా బయట పెట్టేశారు. ఆయన ఒక్కరే కాకుండా, కొందరు కలిస్తేనే ఈ మాటలు కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి నోటి నుంచి వచ్చాయనే అభిప్రాయాలు పార్టీలో వ్యక్తం కావడం విశేషం. అధిష్టానం వద్ద గట్టి పట్టు ఉందని తెలిసి కూడా సీఎం పై తమకున్న అసంతృప్తిని వెళ్లగక్కేశారు. ఈ విదంగా ప్రధాన పార్టీలో రాజకీయ ప్రకంపనలు సృష్టిస్తున్న వారి కోరికలు ఏ విధంగా నెరవేరుతాయో వేచిచూడాల్సిందే.