Mallareddi : బిఆర్ఎస్ ఎమ్మెల్యే, మాజీ మంత్రి మల్లారెడ్డి కుటుంబం బీజేపీ వైపు చూస్తున్నట్టుగా కనిపిస్తోంది. బిఆర్ఎస్ రాజకీయాల్లో మల్లారెడ్డి కుటుంబ సభ్యులు ఎప్పుడు కనిపించలేదు. కానీ గత కొద్దీ రోజుల నుంచి మల్లారెడ్డి కుటుంబం మంత్రి బండి సంజయ్ తో స్నేహం కొనసాగిస్తోంది. ఆయన కోడలు ప్రీతిరెడ్డి కి రాజకీయాలపై ఆసక్తి ఉన్నట్టుగా తెలుస్తోంది. ఆమె పలు సందర్భాల్లో పాల్గొన్న తీరు గమనిస్తే బీజేపీ లో చేరడానికి ఆసక్తి ఉన్నట్టుగా తెలుస్తోంది. రాబోయే ఎన్నికల్లో తాను మల్కాజిగిరి నుంచి పోటీ చేస్తానని కూడా గతంలో అన్నట్టు ప్రచారం జరిగింది సోషల్ మీడియాలో.
బోనాల వేడుకల సందర్బంగా బండి సంజయ్ ని ఆహ్వానిస్తూ పాత బస్తీలో ఆయన అభిమానులు, పార్టీ నాయకులు ఫ్లెక్సీ లు ఏర్పాటు చేశారు. వాటితో పాటు ప్రీతిరెడ్డి కూడా బండి సంజయ్ ని ఆహ్వానిస్తూ ఫ్లెక్సీ ఏర్పాటు చేశారు. ఈ నేపథ్యంలో ఆమె బీజేపీ కండువా కప్పుకుంటారని రాజకీయ పుకార్లు గుప్పుమన్నాయి. అంతే కాదు బండి సంజయ్ కి మల్లారెడ్డి ఇంటిలో ప్రితిరెడ్డి విందు భోజనం ఏర్పాటు చేశారు. ఈ విందు భోజనం సోషల్ మీడియా లో వైరల్ కావడం విశేషం.
మల్లారెడ్డి కి తెలియకుండా ఫ్లెక్సీ లు, విందు భోజనాలు జరగడం అసాధ్యం. కేవలం పరిచయాల కోసం కూడా మల్లారెడ్డికి ముందస్తు సమాచారం ఇవ్వకుండా ప్రితిరెడ్డి ముందడుగు వేయరు. బీజేపీ లో చేరడానికే మల్లారెడ్డి కుటుంబం మెల్ల,మెల్లగా పావులు కదుపుతున్నట్టుగా తెలుస్తోంది. రాబోయే గ్రేటర్ ఎన్నికల నాటికి మల్లారెడ్డి కుటుంబం చేరే అవకాశాలు కనబడుతున్నాయని మల్కాజిగిరి నియోజకవర్గంలో పెద్ద చర్చ కావడం విశేషం.