Minister Bandi Sanjay : కేంద్ర మంత్రి బండి సంజయ్ హైదరాబాద్ లో ఒక ప్రైవేట్ కార్యక్రమంలో పాల్గొన్నారు. మీడియా ప్రతినిధులు రాజకీయ పరంగా అడిగిన పలు ప్రశ్నలకు ఆయన అసహనం వ్యక్తం చేశారు. బిఆర్ఎస్ పార్టీ మీ పార్టీలో విలీనం అవుతుందా ? బీజేపీ తో పొత్తు పెట్టుకుంటున్నదా అని విలేకర్లు అడిగేసరికి ఆయన అసహనానికి గురయ్యారు.
విలీనం, పొత్తులతో ప్రజలకు ఏమిటి సంబంధం అంటూ బండి సంజయ్ ఎదురు ప్రశ్నలు వేశారు. అంతే కాదు విలీనం, పొత్తులు గంగలో కలువనీయండి, వాటితో ప్రజలకేం సంబంధం అటూ మీడియా ప్రతినిధులను ఎదురు ప్రశ్నిస్తూ అసహనం వ్యక్తం చేశారు. అంతే కాదు కేసీఆర్, కేటీఆర్ పేరు చెబితే జనం రాళ్లతో కొట్టడానికి సిద్ధంగా ఉన్నారని అన్నారు. బిఆర్ఎస్ పార్టీ ప్రస్తుత పరిస్థితుల్లో అవుట్ డేటెడ్ పార్టీ అని కూడా స్పష్టం చేశారు.
అవినీతి, అక్రమాల్లో కూరుకు పోయిన బిఆర్ఎస్ పార్టీని విలీనం చేసుకోవాల్సిన అవసరం బీజేపీ కి లేదన్నారు. అంతే కాదు పొత్తు పెట్టుకోవాల్సిన ఖర్మ అంతకూ లేదన్నారు బండి సంజయ్. ఆరు గ్యారంటీల హామీలను పక్కదారి పట్టించడానికే కాంగ్రెస్, బిఆర్ఎస్ కలిసి నాటకాలు ఆడుతున్నాయని ఆయన ఆరోపించారు. కాంగ్రెస్ పార్టీ మోసాలు ప్రజలకు తెలిసి పోయాయన్నారు. విలీనం, పొత్తుల పేరుతో ప్రజలను పక్కదారి పట్టిస్తున్నాయంటూ బండి సంజయ్ ఈ సందర్బంగా ఆగ్రహం వ్యక్తం చేశారు.