brs : కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన కొద్ది రోజుల్లోనే కొన్ని కఠిన నిర్ణయాలు తీసుకొంది. సీఎం రేవంత్ రెడ్డి తీసుకున్న నిర్ణయాల్లో హైడ్రా ఒకటి కావడం విశేషం. రాజకీయంగా ఎలాంటి ఎదురుదెబ్బ తగిలనా పరవాలేదు. హైదరాబాద్ లో అక్రమ నిర్మాణాలను నిర్మూలించాల్సిందే అనే పట్టుదలతో సీఎం రేవంత్ రెడ్డి ఉన్నారు. ఒకరకంగా చెప్పాలంటే సీఎం మొండిగానే హైడ్రా తో యుద్ధం చేస్తున్నారనే అభిప్రాయాలు రాష్ట్రవ్యాప్తంగా వ్యక్తమవుతున్నాయి. వెనుకడుగు వేయకుండా ముందుకు వెళితే మరో పదేళ్లు ఆయనే ముఖ్యమంత్రిగా కొనసాగుతారనే అభిప్రాయాలు సైతం రాజకీయ వర్గాల్లో వ్యక్తం కావడం విశేషం.
ఈ నేపథ్యంలో అక్రమ నిర్మాణాలను కూల్చే విషయంలో ఎలా స్పందించాలో తెలియక గులాబీ శ్రేణులు సతమతమవుతున్నారు. తమ ఎమ్మెల్యేలను లక్ష్యంగా చేసుకుంటున్నారనే భాద ఒకవైపు ఉంది. మరోవైపు అధినేత కేసీఆర్ ప్రజలోకి రావడంలేదు. సీఎం రేవంత్ రెడ్డి పై వ్యతిరేకత ఏర్పడింది అనుకుంటే, ఆ విషయం ఎక్కడ కూడా కనబడుటలేదు. ప్రజల్లో సీఎం కు రోజు, రోజుకు మద్దతు పెరుగుతోంది. ప్రజాస్పందన అనుకూలంగా ఉంది. హైడ్రాతో హైదరాబాద్ లో ప్రజాధారణ మరింత పెరిగింది.
అక్రమ నిర్మాణాల కూల్చివేత విషయాన్నీ బిఆర్ఎస్ వ్యతిరేకిస్తున్నదని ప్రజలకు తెలిసిపోయింది. వాస్తవానికి చెరువులు, కుంటలు కబ్జా జరిగింది గడిచిన పదేళ్ళల్లోనే. అధికారంలో ఉంది కూడా బిఆర్ఎస్ పార్టీనే. బిఆర్ఎస్ నేతలే కబ్జాలకు పాల్పడ్డారనేది కూడా ప్రజలకు తెలిసిపోయింది. హైడ్రా నిర్ణయాలను వ్యతిరేకించిన నేపథ్యంలో ప్రజల్లో వ్యతిరేకత ఏర్పడుతుంది. అధికారం, పలుకుబడి ఉన్నవారే అక్రమ నిర్మాణాలు చేపడుతారు. పేదలు, మధ్యతరగతి వారు ఇలాంటి పనులకు ముందుకు వచ్చే పరిస్థితి లేదు. కబ్జాలకు పాల్పడిన వారికి మద్దతుగా నిలిస్తే పార్టీ పరిస్థితి దిగజారి పోవడం ఖాయం .
కూల్చివేతలను వ్యతిరేకించి రాజకీయం చేసిన నేపథ్యంలో ప్రజల నుంచి ఎదురుదెబ్బ తప్పదు. ఒకవేళ హైడ్రాను సమర్ధించే పరిస్థితి లేదు. అందుకే రాజకీయంగా వ్యతిరేకతను మూటగట్టుకున్నప్పటికి హైడ్రాను వ్యతిరేకించాలనే భావనతో బిఆర్ఎస్ ఉన్నట్టు తెలుస్తోంది. ఏదిఏమైనప్పటికీ అక్రమాల కూల్చివేత విషయంలో ఒక లక్ష్యంతో గులాబీ శ్రేణులు ముందుకు వెళ్లలేకపోతున్నారనేది ప్రజలకు తెలిసిపోయింది.