Encounter : ములుగు జిల్లా సరిహద్దు ప్రాంతంలోని అడవుల్లో భద్రాద్రి కొత్తగూడెం జిల్లా, ములుగు జిల్లా ప్రత్యేక పోలీస్ బలగాలు సంయుక్తంగా కొద్ది రోజుల నుంచి కూంబింగ్ నిర్వహిస్తున్నారు. ఈ నేపథ్యంలో తాడ్వాయి మండలంలోని గుండాల అడవిలోని దామరతొగు వద్ధ గురువారం ఉదయం పోలీసులకు మావోయిస్టులు ఎదురు పడ్డారు. లొంగిపోవాల్సిందిగా పోలీస్ బలగాలు కోరినప్పటికీ మావోయిస్టులు కాల్పులు ప్రారంభించారు. ఆత్మ రక్షణ కోసం పోలీస్ బలగాలు కూడా ఎదురు కాల్పులు ప్రారంభించారు.
ఈ సంఘటనలో ఒక మావోయిస్టు మృతి చెందాడు. మావోయిస్టులు కాల్పులు జరుపుతూ అడవిలోకి పారిపోయారు. అనంతరం సంఘటన స్థలంలో గాలింపు చేపట్టగా చనిపోయిన మావోయిస్టు కనిపించాడు. మృతి చెందిన మావోయిస్టు భూపాలపల్లి జిల్లా గణపురం మండలం బుద్ధారం గ్రామానికి చెందిన నల్లమారి అశోక్ అలియాస్ విజేందర్ గా పోలీసులు గుర్తించినట్లు సమాచారం. పారిపోయిన వారి గురించి పోలీస్ బలగాలు గాలింపు చేపట్టాయి.