Jump Jilanee : భారత రాష్ట్ర సమితి ఘోర పరాజయాన్ని మూట గట్టుకున్న నాటి నుంచి వరుసగా ఎదురుదెబ్బలు తగులుతున్నాయి. అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమిచెందిన వారితో పాటు, గెలిచిన వారు సైతం పార్టీని వీడుతున్నారు. చివరకు పార్లమెంట్ ఎన్నికల్లో సైతం పార్టీ నష్టాన్నే మూటగట్టుకుంది. మరోవైపు అధినేత కేసీఆర్ కూతురు ఎమ్మెల్సీ కవిత జైలు కు వెళ్లడంతో పార్టీ శ్రేణుల్లో అనేక అనుమానాలు తలెత్తుతున్నాయి. కూతురును కాపాడుకోలేని నాయకుడు, పార్టీ నాయకత్వాన్ని ఎలా కాపాడుతాడని గుసగుసలు మొదలైనాయి.
కాంగ్రెస్ పార్టీ అధికారం చేపట్టిన తరువాత పార్టీ అభివృద్ధికి మొదటి ప్రాధాన్యత ఇస్తోంది. సీఎం రేవంత్ రెడ్డి పీసీసీ అధ్యక్షుడి హోదాలో చేరికలకు తలుపులు తెరిచి ఉంచారు. ఇప్పటికే పది మంది ఎమ్మెల్యేలు కాంగ్రెస్ కండువా కప్పుకున్నారు. మరో పదహారు మంది చేరితే బిఆర్ఎస్ ఎల్పీ కాంగ్రెస్ లో విలీనం అవుతుంది. ఇప్పుడు మరో నలుగురు కాంగ్రెస్ కండువా కప్పుకోడానికి సిద్ధమైనట్టు రాజకీయ వర్గాల సమాచారం.
పార్టీలో చేరడానికి సిద్దమైన వారిలో జహీరాబాద్ ఎమ్మెల్యే మాణిక్ రావు, ఆలంపూర్ ఎమ్మెల్యే విజేయుడు, బోథ్ ఎమ్మెల్యే అనిల్ జాదవ్ తో పాటు గ్రేటర్ హైదరాబాద్ కు చెందిన మరో ఎమ్మెల్యే పేరు కూడా కాంగ్రెస్ శిబిరంలో వినిపిస్తోంది. ఈ నలుగురితో పాటు మరికొందరు ఎమ్మెల్యేలు కూడా కాంగ్రెస్ కీలక నేతలతో సంప్రదింపులు జరుపుతున్నారని సమాచారం.
పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేలపై వేటు వేసేందుకు బిఆర్ఎస్ చట్టపరంగా చర్యలు మొదలుపెట్టింది. న్యాయపరంగా పోరాటం కొనసాగిస్తోంది. ఈ నేపథ్యంలో పార్టీ మారాలి అనుకునే వారు ఒకటికి పది సార్లు ఆలోచిస్తున్నారు. పార్టీ మారకుంటే నియోజకవర్గంలో అభివృద్ధి చేపట్టలేం. బిఆర్ఎస్ లోనే ఉంటె నియోజకవర్గంలో వ్యతిరేకత ఏర్పడుతుంది.
ఇప్పుడు బిఆర్ఎస్ ఎమ్మెల్యేల పరిస్థితి ముందు నుయ్యి, వెనుక గొయ్యి లా తయారైనది. బిఆర్ఎస్ ఎమ్మెల్యేలపై ఓటమి చెందిన వారు పార్టీలో చేరడానికి వచ్చే ఎమ్మెల్యేలను వ్యతిరేకిస్తున్నారు. బుజ్జగింపుల కార్యక్రమాన్ని స్వయంగా సీఎం రేవంత్ రెడ్డి చేపట్టారు. ఆయన అభయంతో అడ్డుతగులుతున్న నేతలు వెనక్కి తగ్గారు. ఇప్పుడు చేరికలకు మార్గం తేలికయినది. ఈ నేపథ్యంలో ముందు, ముందు చేరికల పరిణామం ఊపందుకోనుందనే అభిప్రాయాలు సైతం వ్యక్తం అవుతున్నాయి.