Telangana TDP : తెలంగాణలో తెలుగు దేశం పార్టీపై ఏపీ సీఎం దృష్టి సారించారు. పూర్వవైభవం సాధించడానికి సీనియర్ నాయకులతో ఇప్పటికే రెండు దఫాలుగా చంద్రబాబు చర్చలు జరిపారు. తెలంగాణ లో తిరిగి పాగా వేయాలంటే ఎలా ముందుకు వెళ్ళాలి. గ్రామీణ ప్రాంతాల్లో పార్టీ అభిప్రాయం ఎలా ఉంది. పట్టణాల్లో పార్టీలో ఇంకా కొనసాగుతున్నారా ? పార్టీని ముందుకు తీసుకెళ్లాలంటే ఎలాంటి ప్రణాళికలను అమలు చేయాలి అనే అంశాలపై ఆయన తన అనుచరులతో కూడా చర్చలు జరిపారని సమాచారం. ప్రస్తుతం పార్టీ పగ్గాలను ఎవరి చేతిలో పెడితే బాగుంటది అనే విషయం కూడా చర్చకు వచ్చినట్టు తెలిసింది.
ఏపీలో రెండోసారి అధికారంలోకి రావడంతో పార్టీకి జాతీయ స్థాయిలో గుర్తింపు వచ్చింది. అదేవిదంగా తెలంగాణలో రాబోయే ఎన్నికల్లో కూడా బీజేపీ, జనసేన, తెలుగు దేశం పార్టీలు కలిసి పోటీ చేస్తాయి అనే అభిప్రాయం రాజకీయ వర్గాల్లో ఉంది. ఈ నేపథ్యంలో ముందుగా తమ బెర్త్ ఏర్పాటు చేసుకుంటే రాజకీయ భవిష్యత్తు ఉంటుందని కొందరు అమరావతికి వెళ్లి వస్తున్నారు. ప్రస్తుత రాజకీయ పరిస్థితులను పరిశీలిస్తే గులాబీ శ్రేణులే పసుపు కండువా కప్పుకునే పరిస్థితిఎక్కువగా కనబడుతోంది.
తెలంగాణలో జరిగిన రెండు అసెంబ్లీ ఎన్నికల్లో ఎమ్మెల్యేలు, ఎంపీలుగా గెలిచిన వారిని కేసీఆర్ తన ఖాతాలో వేసుకున్నారు. బిఆర్ఎస్ లో ఉన్న ప్రతిమ శ్రేణి నాయకుల్లో కేసీఆర్ నుంచి మొదలుకొని తలసాని శ్రీనివాస్ యాదవ్ వరకు సుమారు 70 శాతం మంది పసుపు చొక్కా నాయకులే కావడం విశేషం. ఇందులో కేసీఆర్ మినహా మిగతా వారందరికీ చంద్రబాబు అంటే బోలెడంత అభిమానం. బిఆర్ఎస్ లోని ప్రథమ శ్రేణి నాయకుల్లో కొందరు మెజార్టీ నాయకులు బాబును కలిసి ఆశీర్వాదం కూడా తీసుకున్నారు. పదవులు కూడా అడిగిన వారు ఉన్నారు.
తెలుగు దేశం పార్టీ లో చేరి పేరు ప్రఖ్యాతలు సంపాదించాం అని కావచ్చు, లేదంటె చంద్రబాబు పై ఉన్న అభిమానం తో కావచ్చు నేటికి కూడా పార్టీలోనే చాలా మంది కొనసాగుతున్నారు. అందులో రావుల చంద్రశేఖర్ రెడ్డి, అరవింద్ కుమార్ గౌడ్, నర్సిరెడ్డి, బక్కని నరసింహులు, కాట్రగడ్డ ప్రసూన, నందమూరి సుహాసిని వంటి రాష్ట్ర స్థాయి నేతలు ఉన్నారు. వీరితో పాటు కమ్మ సామాజిక వర్గం అంతా కూడా నేటికి తెలంగాణాలో పార్టీ ఆవిర్భావ ఉత్సవాన్ని జరుపుకుంటున్నారు. అదే విదంగా మాజీ ముఖ్యమంత్రి ఎన్టీ రామారావు జయంతి, వర్ధంతి వేడుకలను కూడా కమ్మ సామాజిక వర్గం ఘనంగా జరుపుతోంది. ఈ వర్గం కూడా నేటికీ పార్టీని అభిమానిస్తోంది. వీరందరిని కలుపుకొని వెళ్లిన నేపథ్యంలో పార్టీకి పూర్వ వైభవం వచ్చే అవకాశాలు కూడా ఎక్కువగా కనబడుతున్నాయని చంద్రబాబు తన అనుచరుల వద్ద అభిప్రాయపడినట్టు తెలిసింది.
ఉమ్మడి రాష్ట్రంలో పార్టీ అధికారంలో ఉన్నన్ని రోజులు చంద్రబాబుకు అండగా నిలిచారు మాజీ మంత్రి దేవేందర్ గౌడ్. ఆయన మేనల్లుడు అరవింద్ కుమార్ గౌడ్ కు పార్టీ పగ్గాలు అప్పగించడానికి చంద్రబాబు ఒక నిర్ణయం తీసుకున్నట్టు తెలిసింది. ఇది ఇలా ఉండగా పార్టీ అధ్యక్ష భాద్యతలు అప్పగిస్తే పార్టీలో చేరడానికి మాజీ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ సిద్ధంగా ఉన్నట్టు తెలిసింది. తలసాని కి ఏపీ మంత్రి యనమల రామకృష్ణుడు సమీప బందువు అవుతారు. యనమల తో రాయబారం నడుపుతున్నట్టు విశ్వసనీయ వర్గాల సమాచారం. ప్రస్తుత బిఆర్ఎస్ ఎమ్మెల్యే మల్లారెడ్డి కూడా పార్టీ అధ్యక్ష పదవిని ఆశిస్తున్నారు. ఈయన కూడా తనవంతు ప్రయత్నాలు చేస్తున్నారు. ఈ ముగ్గురిలో ఒకరు తెలంగాణ తెలుగు దేశం పార్టీ అధ్యక్షుడు ఖాయం అవుతారని పార్టీ వర్గాల సమాచారం.