Telangana woman congress : తెలంగాణ రాష్ట్ర మహిళా కాంగ్రెస్ నూతన అధ్యక్షురాలిని ఎంపిక చేయడానికి పార్టీ అధిష్టానం కసరత్తు మొదలు పెట్టింది. ప్రస్తుతం ముగ్గురు మహిళా నాయకుల పేర్లను పీసీసీ ఎంపిక చేసింది. ఎంపిక చేసిన వారి వివరాలను కూడా రాష్ట్ర నాయకత్వం ఢిల్లీ పెద్దలకు పంపింది. పోటీలో ఉన్న ముగ్గురు కూడా తమదయిన శైలిలో ఢిల్లీలో ప్రయత్నాలు చేస్తున్నారు. రాష్ట్ర పెద్దలతో కూడా మంతనాలు జరుపుతున్నారు.
ప్రస్తుత అధ్యక్షురాలుగా కొనసాగుతున్న సునీత రావు పదవీ కాలం ముగిసింది. సునీతరావు మాత్రం పెద్ద పదవిపై ఆశలు పెట్టుకున్నారు. ఇటీవల జరిగిన ఎన్నికల్లో సునీతరావు గోస్ మహల్ స్థానం నుంచి కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీచేసి ఓటమి పాలయ్యారు. పార్టీ అభ్యర్థులు ఓటమి చెందిన నేపథ్యంలో ఏడాదిపాటు ఎలాంటి పదవులు ఇవ్వరాదని ఏఐసీసీ నిర్ణయం తీసుకుంది. అయినప్పటికీ సునీతరావు మాత్రం మరోసారి తనకే రాష్ట్ర పగ్గాలు అప్పగించాలని కోరుతోంది. లేదంటే ఏదయినా రాష్ట్ర స్థాయిలో కార్పొరేషన్ పదవి అయినా ఇవ్వాలని కోరుతోంది. ఒకవేళ తనకు ఇవ్వని నేపథ్యంలో సీనియర్ నాయకురాలు నీలం పద్మకు ఇవ్వాలని కోరుతున్నారు.
గద్వాల్ మాజీ జిల్లా పరిషత్తు ఛైర్పర్సన్ సరితా తిరుపతయ్య, బడంగిపేట మేయర్ పారిజాత నర్సింహా రెడ్డి, బీసీ నాయకురాలు సరిత పేర్లను కూడా ప్రతిపాదించి ఏఐసీసీకి నివేదిక పంపినట్టు పార్టీ వర్గాల సమాచారం. కానీ ఈ ముగ్గురిలో ఒకరిని రాష్ట్ర మహిళా కాంగ్రెస్ అధ్యక్ష పదవికి ఎంపిక చేయనున్నటు పార్టీ వర్గాల సమాచారం. ఇప్పటికే కర్ణాటక, అరుణాచల్ ప్రదేశ్, చండీఘడ్ రాష్ట్రాలకు మహిళా కాంగ్రెస్ అధ్యక్షులను నియమించారు. ఈ నేపథ్యంలోనే తెలంగాణ కు కూడా త్వరలోనే అధ్యక్షురాలిని నియమించనున్నట్టు పార్టీ శ్రేణులు చెబుతున్నారు.