Singareni : సింగరేణి బొగ్గుగని కార్మికులపై విజిలెన్స్ డిపార్ట్మెంట్ కు చెందిన కొందరి వేధింపులు రోజు, రోజుకు మితిమీరి పోతున్నాయని గోదావరి లోయ బొగ్గు గని కార్మిక సంఘం (IFTU) రాష్ట్ర అధ్యక్షుడు ఐ కృష్ణ ఆరోపించారు. బుధవారం ఆయన గోదావరిఖని యూనియన్ కార్యాలయంలో మాట్లాడుతూ విజిలెన్స్ లోని పలువురు అధికారులు, సిబ్బంది అవలంబిస్తున్న విధానాల వలన కార్మికులు మానసికంగా ఆందోళన చెందుతున్నారని అన్నారు. అకారణంగా కార్మికులకు నోటీసులు ఇస్తూ వేధింపులకు గురిచేస్తున్నారని ఆయన ఆరోపించారు. చేయని తప్పుకు కూడా వారి వలన శిక్ష అనుభవించాల్సిన పరిస్థితి ఏర్పడిందని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు.
కొందరి చెప్పుడు మాటలు విని కూడా కార్మికులను వేధిస్తున్నారని కృష్ణ ఈ సందర్బంగ ఆరోపించారు. విజిలెన్స్ శాఖ నమోదు చేసిన కేసులు కూడా నేటికీ సైతం అపరిష్కృతంగానే ఉన్నాయన్నారు. కేసులు పరిస్కారం కాకపోవడంతో కార్మికులు ఆర్థికంగా నష్ట పోతున్నారని అన్నారు. కార్మికుల సంక్షేమం కోసం కృషి చేయాల్సిన సంబంధిత అధికారులు కూడా పట్టించుకోక పోవడంపై ఆయన తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. గుర్తింపు సంఘం తో పాటు ప్రాతినిధ్య సంఘం కూడా విజిలెన్స్ వేధింపులు తెలిసి కూడా తెలియనట్టుగా నటిస్తున్నాయని ఆయన ఆరోపించారు.
సింగరేణి ఉన్నతాధికారులు, గుర్తింపు సంఘం వెంటనే స్పందించి విజిలెన్స్ కేసులు ఉన్న కార్మికుల సమస్యను వెంటనే పరిష్కరించాలని ఆయన డిమాండ్ చేశారు. లేనిచో గోదావరి లోయ బొగ్గు గని కార్మిక సంఘం సింగరేణి వ్యాప్తంగా చేపట్టే శాంతియుత ఆందోళనకు యాజమాన్యం, గుర్తింపు సంఘం భాద్యత వహించాల్సి ఉంటుందన్నారు. ఈ సమావేశంలో ఐఎఫ్టియు నాయకులు ఈ నరేష్, ఐ రాజేశం,ఎం కొమరయ్య, కొండ్ర మొగిలి, అఫ్జల్. తదితరులు పాల్గొన్నారు.