Singareni Medical : సింగరేణి బొగ్గు గని కార్మికులు గనిలోకి వెళ్లారంటే తిరిగి వచ్చేది నమ్మకం తక్కువ. కానీ అమాయకులైన కార్మికులు మాత్రం సింగరేణి అధికారులను, కార్మిక సంఘాల నాయకులను నమ్ముతారు. నమ్మిన కార్మికులను నట్టేట ముంచడం పలువురు అధికారులతో పాటు పలు కార్మిక సంఘాల నాయకులకు కూడా వెన్నతో పెట్టిన విద్య. అమాయకులైన కార్మికుల మెడికల్ అన్ ఫిట్ ను ఆసరా చేసుకొని పలువురు నాయకులు, అధికారులు కలిసి లక్షల్లో వసూలు చేసి జేబులు నింపుకున్నారనే ఆరోపణలు సింగరేణిలో సర్వత్రా వ్యక్తం కావడం విశేషం.
సింగరేణి సి అండ్ ఎండి అధికారిగా బలరాం భాద్యతలు తీసుకున్న వెంటనే ఆయన మెడికల్ బోర్డులో జరిగిన అవకతవకలపై సీఐడి అధికారులను విచారణ చేపట్టాల్సిందిగా ఆదేశాలు జారీ చేశారు. గత రెండు నెలలుగా విచారణ జరుగుతోంది. విచారణ వేగవంతంగా జరుగుతోంది. లక్షల రూపాయలు చేతులు మారినట్టుగా సీఐడీ పసిగట్టింది. విచారణ విషయం గుప్పుమంది. సీఐడీ విచారణలో పలు కీలక విషయాలు వెలుగులోకి వచ్చినట్టు సమాచారం. మెడికల్ బోర్డు లో జరిగిన అవకతవకలపై ఎవరెవరి పాత్ర ఎంత ఉంది. సింగరేణి విస్తరించిన ఏయే ప్రాంతాల్లో అక్రమాలు జరిగాయి అనే విషయాలపై విచారణ జరుగుతోంది. అక్రమాలకు పాల్పడిన వారిలో ప్రకంపనలు మొదలైనాయి.
సింగరేణి కొత్తగూడెం ప్రధాన ఆసుపత్రితోపాటు ప్రధాన కార్యాలయంలో కూడా మెడికల్ బోర్డు కు సంబందించిన పత్రాలను పరిశీలించినట్టు సమాచారం. ఇప్పటివరకు ఎంతమంది కార్మికులు బోర్డు ద్వారా అన్ ఫిట్ అయ్యారు. వాళ్లకు ఉన్న జబ్బులు ఏమిటి. అసలు ఎలాంటి జబ్బులకు అన్ ఫిట్ చేయాలి. కార్మికులు ఏ జబ్బు కారణంతో అన్ ఫిట్ అయ్యారో, నిజంగా ఆ జబ్బు ఉందా ? నిజంగా ఉంటె వైద్యంతో కూడా నయం కాలేని పరిస్థితి ఉందా ? అనే కోణాల్లో విచారణ చేసినట్టు విశ్వసనీయ వర్గాల సమాచారం. వైద్యం పేరుతో దొడ్డి దారిన అన్ ఫిట్ చేయించిన కార్మిక నాయకులతో పాటు, సంబందించిన అధికారుల్లో కూడా ప్రకంపనలు మొదలైనాయి.
అధికారాన్ని అడ్డం పెట్టుకొని మెడికల్ బోర్డు లో చెలాయించిన వారు ఇప్పుడు తలపట్టుకుంటున్నారు. గత ప్రభుత్వం హయాంలో సింగరేణిలో కొందరు నాయకులు కీలక పాత్ర పోషించారు. సింగరేణిలో పెత్తనం చెలాయించిన నాయకుల్లో కొందరిని సీఐడీ అధికారులు తమదయిన శైలిలో విచారించే అవకాశాలు కూడా ఉన్నాయని విశ్వసనీయ వర్గాల సమాచారం. ఇప్పటికే పలు ప్రాంతాల్లో పలువురు నాయకులను విచారించినట్టు సమాచారం. మెడికల్ బోర్డు లో చక్రం తిప్పిన నాయకులు, అధికారుల్లో దోషులుగా తేలితే శిక్ష తప్పదనే అభిప్రాయాలు కూడా సింగరేణిలో వ్యక్తమవుతున్నాయి. గుట్టు చప్పుడు కాకుండా సాగుతున్న సీఐడీ విచారణ ఎప్పుడు గుప్పుమననుందో
వేచిచూడాలి.