ysrcp : వైఎస్సార్ సీపీ రాజకీయ సుడిగుండంలో చిక్కుకుపోయే పరిస్థితి కనబడుతోంది. ఇద్దరు ఎమ్మెల్సీలు, ఇద్దరు రాజ్యసభ సభ్యులు జగన్ కు గుడ్ బై చెప్పేశారు. వీరితో పాటు మరికొందరు కూడా పార్టీ కండువా మార్చుకోడానికి సిద్ధంగా ఉన్నట్టు పార్టీలో గుసగుసలు వినిపిస్తున్నాయి. తగిన ముహూర్తం కోసం ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, రాజ్యసభ సభ్యులు వేచి చూస్తున్నారని తెలిసింది.
పార్టీ మారాలనే ఆలోచన ఉన్నవారిని బుజ్జగిస్తున్నారు. కొందరు మెత్తబడిపోతున్నారు. అయినా నిలకడగా ఉండటం లేదు. అధినేత జగన్ ఇదే నెలలో మూడో తేదీ నుంచి 25 తేదీ వరకు తన కూతురు పుట్టిన రోజు వేడుకను లండన్ లో నిర్వహించుకోడానికి వెళుతున్నారు. ఆయన అలా వెళ్ళగానే , ఇలా పార్టీ కండువా తీసేసుకొని, మరో పార్టీ కండువా కప్పుకోడానికి కొందరు నేతలు సిద్దమైనట్టుగా పార్టీలో జోరుగా ప్రచారం జరుగుతోంది. జంప్ జిలానీ అయ్యేవారిలో కొందరు రాజ్యసభ సభ్యులు, ఎమ్మెల్సీలు సైతం ఉన్నారని సమాచారం.
పార్టీలో ఎదురయ్యే సంక్షోభాన్ని జగన్ ముందుగానే పసిగట్టారు. వెళ్లేవారిని బుజ్జగించడం అనవసరం అనే అభిప్రాయంతోనే జగన్ ఉన్నారు. అసంతృప్తితో ఉన్నవారిని ఎందుకు బుజ్జగించాలి అనే పట్టించుకోవడం లేదని సమాచారం. జగన్ అవలంబిస్తున్న ఆలోచన విధానంపై కూడా కొందరు నేతలు అసంతృప్తితో ఉన్నారు. అందుకే ముందు జాగ్రత్త పడుతున్నారని తెలిసింది. జగన్ విమానం ఎక్కగానే , పలువురు నేతలు పచ్చ చొక్కా వేసుకోడానికి సిద్ధమైనట్టు పార్టీలో చర్చ జరుగుతోంది.