కోల్ బెల్ట్ న్యూస్ (బీబీపేట):
ముదిరాజ్ సోదరుల సంక్షేమం, కులవృత్తుల అభివృద్ధిపై ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించాలని కామారెడ్డి జిల్లా బీబీపేట మండల ముదిరాజ్ జిల్లా ప్రధాన కార్యదర్శి కొరవి నర్సింలు డిమాండ్ చేశారు. శనివారం మత్స్యకారుల దినోత్సవం సందర్భంగా ఆయన ప్రెస్‌నోట్ విడుదల చేసి మాట్లాడారు. నైజాం పాలన కాలం నుంచి ఇప్పటివరకు అనేక ప్రభుత్వాలు అధికారంలోకి వచ్చినప్పటికీ ముదిరాజుల జీవనోపాధి, కులవృత్తుల అభివృద్ధికి ఆశించిన స్థాయిలో ప్రాధాన్యం ఇవ్వలేదని నర్సింలు ఆవేదన వ్యక్తం చేశారు. ముదిరాజ్ సోదరులు పండ్లు, కూరగాయలు, పండ్ల వ్యాపారం, వ్యవసాయ ఆధారిత వృత్తులపై ఆధారపడి జీవిస్తున్నారని తెలిపారు.
ముదిరాజులకు ప్రత్యేకంగా భూములు, రైతు బీమా, ఆర్థిక సహాయం, వృత్తి ఆధారిత పథకాలు కల్పించాల్సిన అవసరం ఉందన్నారు. పండ్లు, కూరగాయలు, టమాటా, అరటి, కర్బూజా, సంత్రా, మామిడి తదితర పంటలను సాగు చేసుకునే వారికి ప్రభుత్వం ఆర్థికంగా అండగా నిలవాలని కోరారు.బీసీ బంధు వంటి పథకాల ద్వారా ముదిరాజ్ కుటుంబాలకు మరింత ప్రయోజనం కల్పించాలని, భూములు లేని నిరుపేద కుటుంబాలకు భూములు లేదా జీవనోపాధికి అవసరమైన ప్రత్యామ్నాయ సహాయం అందించాలని నర్సింలు కోరారు.
“ఎన్నో ప్రభుత్వాలు మారినా ముదిరాజుల జీవితాల్లో ఆశించిన మార్పు రావడం లేదు. మా కులవృత్తులను కొనసాగించేందుకు ప్రభుత్వం ఏం చేసింది? మాకు ఎలాంటి పథకాలు అందాయి? అనే ప్రశ్నలకు ప్రభుత్వం సమాధానం చెప్పాలి” అని ఆయన అన్నారు.ముదిరాజ్ సోదరులు ఇకనైనా ఏకతాటిపైకి వచ్చి తమ హక్కులు, సంక్షేమం కోసం ప్రభుత్వాన్ని ప్రశ్నించాలని పిలుపునిచ్చారు. కేవలం రాజకీయ పదవులు, హామీలపై ఆధారపడకుండా ముదిరాజుల జీవనోపాధి, ఆర్థిక అభివృద్ధి కోసం స్పష్టమైన విధానాలు అమలు చేయాలని డిమాండ్ చేశారు.“మా ఓటు మేము వేస్తున్నాం. ప్రభుత్వాలు, ఎమ్మెల్యేలు, ప్రజాప్రతినిధులను ఎన్నుకుంటున్నాం. కానీ మా జీవితాల్లో మాత్రం మార్పు కనిపించడం లేదు. ఇకనైనా ముదిరాజుల సమస్యలను ప్రభుత్వం గంభీరంగా పరిగణించి శాశ్వత పరిష్కారం చూపాలి” అని కొరవి నర్సింలు అన్నారు.

