పొన్నారం జిల్లా పరిషత్ పాఠశాలలో ప్రత్యేక బాల గ్రామసభ
బాల్య వివాహాల నిరోధానికి ప్రతిజ్ఞ
కోల్ బెల్ట్ న్యూస్(మందమర్రి):
బాలల హక్కుల పరిరక్షణ, వారి సమస్యల పరిష్కారం, బాల కార్మిక వ్యవస్థ నిర్మూలన, బాల్య వివాహాల నివారణే లక్ష్యంగా బాలల దినోత్సవాన్ని పురస్కరించుకొని పొన్నారం గ్రామంలోని జిల్లా పరిషత్ పాఠశాలలో ప్రత్యేక బాల గ్రామసభను ఘనంగా నిర్వహించారు. సర్పంచ్ పెంచాల మధు అధ్యక్షతన జరిగిన ఈ సమావేశంలో బాలల హక్కులు, వారి భద్రత, విద్య, సామాజిక బాధ్యతలపై ప్రత్యేకంగా చర్చించారు.ఈ కార్యక్రమానికి జిల్లా పంచాయతీ అధికారి కిషన్, ఎంపీడీవో రాజేశ్వర్, ఎంపీఓ మహేష్ ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. ఈ సందర్భంగా జిల్లా పంచాయతీ అధికారి కిషన్ చిన్నారులతో కలిసి కేక్ కట్ చేసి బాలల దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం విద్యార్థులతో మమేకమై వారి సమస్యలు, అభిప్రాయాలు, అవసరాలను అడిగి తెలుసుకున్నారు.
ఈ సందర్భంగా డీపీఓ కిషన్ మాట్లాడుతూ బాలలందరికీ సమాన హక్కులు కల్పించడం, నాణ్యమైన విద్య అందించడం, బాలలపై జరిగే వివక్షను అరికట్టడం ప్రతి ఒక్కరి బాధ్యత అని పేర్కొన్నారు. బాలబాలికల హక్కులు, బాల కార్మికుల నిరోధక చట్టం, బాల్య వివాహాల వల్ల కలిగే అనర్థాలు, బాల నేరస్థులకు సంబంధించిన చట్టాలు, బాలల రక్షణకు ప్రభుత్వం కల్పిస్తున్న చట్టపరమైన భద్రతపై విద్యార్థులకు వివరంగా అవగాహన కల్పించారు.అలాగే బాలలు తమకు ఎదురయ్యే సమస్యలను భయపడకుండా ఉపాధ్యాయులు, తల్లిదండ్రులు, సంబంధిత అధికారుల దృష్టికి తీసుకురావాలని సూచించారు. బాలల అభిప్రాయాలకు గ్రామస్థాయిలో ప్రాధాన్యత కల్పించాలని, వారి విద్యాభివృద్ధి, ఆరోగ్యం, భద్రతకు గ్రామ పంచాయతీ ప్రత్యేక శ్రద్ధ చూపాలని తెలిపారు.
అనంతరం బాల్య వివాహాల నిర్మూలనకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని పిలుపునిస్తూ విద్యార్థులు, ప్రజాప్రతినిధులు, అధికారులు కలిసి బాల్య వివాహాల నిరోధక ప్రతిజ్ఞ చేశారు. బాలలకు సురక్షితమైన, ఆరోగ్యకరమైన వాతావరణం కల్పించేందుకు అందరూ సమిష్టిగా పనిచేయాలని ఈ సందర్భంగా నిర్ణయించారు.ఈ కార్యక్రమంలో ఉపసర్పంచ్ అమృత, పంచాయతీ కార్యదర్శి హరీష్, వార్డు సభ్యులు సంకె శ్రీనివాస్, సూరిమిళ్ల పద్మ, వంశీ, విద్యా కమిటీ చైర్మన్ గోగు సుమలత, పాఠశాల ఉపాధ్యాయులు, ఫీల్డ్ అసిస్టెంట్ ఈద లింగయ్య, అంగన్‌వాడీ టీచర్లు రజిత, తిరుమల, విద్యార్థులు, తల్లిదండ్రులు తదితరులు పాల్గొన్నారు.

