600కు పైగా చిత్రాల్లో నటించి ప్రేక్షకుల మనసుల్లో చెరగని ముద్ర
టాలీవుడ్‌లో విషాదం
కోల్ బెల్ట్ న్యూస్ ప్రతినిధి:
టాలీవుడ్‌లో తీవ్ర విషాదం నెలకొంది. ప్రముఖ సినీనటుడు గిరిబాబు (80) కన్నుమూశారు. కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన కొండాపూర్‌లోని ఓ ప్రైవేటు ఆస్పత్రిలో చికిత్స పొందుతూ శనివారం తుదిశ్వాస విడిచారు. ఆయన మృతితో తెలుగు సినీ పరిశ్రమలో విషాద ఛాయలు అలుముకున్నాయి. గిరిబాబు మృతిపట్ల పలువురు సినీ ప్రముఖులు, నటీనటులు, అభిమానులు తీవ్ర సంతాపం వ్యక్తం చేస్తున్నారు.
ప్రకాశం జిల్లా రావినూతల గ్రామంలో 1946 జూన్ 8న జన్మించిన గిరిబాబు అసలు పేరు యర్రా శేషగిరిరావు. 1973లో విడుదలైన ‘జగమే మాయ’ చిత్రంతో సినీరంగ ప్రవేశం చేశారు. నాలుగు దశాబ్దాలకు పైగా సాగిన తన సినీ ప్రయాణంలో 600కు పైగా చిత్రాల్లో నటించి విశేష గుర్తింపు పొందారు. విలన్‌గా, హాస్యనటుడిగా, క్యారెక్టర్ ఆర్టిస్టుగా విభిన్న పాత్రలు పోషిస్తూ ప్రేక్షకులను మెప్పించారు.
‘కితకితలు’, ‘ఎవడైతే నాకేంటి’, ‘అతడు’, ‘నువ్వే కావాలి’, ‘అల్లుడా మజాకా’, ‘ప్రేమలేఖలు’, ‘ప్రతినిధి’, ‘మిస్టర్ అండ్ మిసెస్ శైలజ కృష్ణమూర్తి’, ‘భైరవద్వీపం’ తదితర చిత్రాల్లో ఆయన పోషించిన పాత్రలు ప్రేక్షకుల ఆదరణ పొందాయి. తనదైన నటనతో తెలుగు సినీ రంగంలో ప్రత్యేక స్థానాన్ని సంపాదించుకున్న గిరిబాబు మరణం సినీ పరిశ్రమకు తీరని లోటుగా పలువురు అభివర్ణిస్తున్నారు.

