పెండింగ్ సమస్యలు వెంటనే పరిష్కరించాలి
ఏఐటీయూసీ ఆధ్వర్యంలో మందమర్రి ఏరియాలో గేట్ మీటింగ్‌లు, నిరసనలు
కోల్ బెల్ట్ న్యూస్(మందమర్రి):
సింగరేణి కార్మికుల దీర్ఘకాలిక పెండింగ్ సమస్యలను పరిష్కరించడంలో యాజమాన్యం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందని ఆరోపిస్తూ, ఏఐటీయూసీ గుర్తింపు సంఘం ఆధ్వర్యంలో బుధవారం మందమర్రి ఏరియాలోని వివిధ గనులు, కార్యాలయాల వద్ద గేట్ మీటింగ్‌లు, నిరసన కార్యక్రమాలు నిర్వహించారు. KK-5 గని, KKOC ప్రాజెక్టు, ఏరియా వర్క్‌షాప్, స్టోర్స్, సివిల్ డిపార్ట్‌మెంట్, KK-1 డిస్పెన్సరీ, S&PC కార్యాలయం, MVTC ఆవరణల్లో పిట్ కార్యదర్శుల అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమాల్లో కార్మికులు పెద్ద సంఖ్యలో పాల్గొని యాజమాన్య వైఖరికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు.
ఈ సందర్భంగా ఏఐటీయూసీ బ్రాంచి కార్యదర్శి శైలేంద్ర సత్యనారాయణ, బ్రాంచి వైస్ ప్రెసిడెంట్ భీమనాదుని సుదర్శన్ మాట్లాడుతూ.. సింగరేణి కార్మికుల న్యాయమైన సమస్యలను పలుమార్లు యాజమాన్యం దృష్టికి తీసుకెళ్లినా, ధర్నాలు, ఆందోళనలు నిర్వహించినా పరిష్కారం లభించకపోవడం విచారకరమన్నారు. కార్మికుల శ్రమతో అభివృద్ధి చెందుతున్న సింగరేణి సంస్థలో వారి సంక్షేమానికి ప్రాధాన్యత ఇవ్వాల్సిన యాజమాన్యం, ఇచ్చిన హామీలను అమలు చేయకుండా కాలయాపన చేయడం సరికాదని విమర్శించారు. కార్మికుల సమస్యల పరిష్కారం కోసం ఏఐటీయూసీ ఆధ్వర్యంలో 2026 జూన్ 8న సమ్మె నోటీసు అందించామని, లేబర్ కమిషనర్ సమక్షంలో జరిగిన చర్చల అనంతరం ఆగస్టు 28న యాజమాన్యంతో ఒప్పందం కుదిరిందని నాయకులు గుర్తుచేశారు. అయితే ఒప్పందంలో పేర్కొన్న అనేక అంశాలు ఇప్పటికీ అమలుకు నోచుకోలేదని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రతి నెలా మెడికల్ బోర్డులు నిర్వహిస్తామని హామీ ఇచ్చి మూడు నెలలపాటు నిర్వహించిన అనంతరం నిలిపివేయడం కార్మికులను నిరాశకు గురిచేసిందన్నారు.
మారుపేర్ల సమస్య పరిష్కారానికి 2022 ఏప్రిల్‌లో కుదిరిన ఒప్పందాన్ని అమలు చేయకుండా, మరోసారి ఒప్పందం చేసుకుని ప్రభుత్వం కమిటీని ఏర్పాటు చేసినప్పటికీ, కమిటీ నివేదిక పూర్తయిన తర్వాత కూడా సమస్యను పరిష్కరించకపోవడం అన్యాయమన్నారు. ముఖ్యంగా 35 నుంచి 40 సంవత్సరాల వయస్సు కలిగిన అర్హులైన అభ్యర్థులకు న్యాయం చేయాలని డిమాండ్ చేశారు. మిగిలిన అర్హులైన డిపెండెంట్ అభ్యర్థులకు నెల రోజుల్లోగా నియామక ఉత్తర్వులు జారీ చేస్తామని హామీ ఇచ్చిన యాజమాన్యం, ప్రభుత్వ అనుమతుల పేరుతో జాప్యం చేయడం తగదన్నారు.సింగరేణి కార్మికులకు సొంత ఇంటి పథకం అమలు చేస్తామని పలుమార్లు హామీ ఇచ్చినా ఇప్పటివరకు కార్యరూపం దాల్చలేదని విమర్శించారు. అర్హులైన కార్మికులందరికీ ఈ పథకాన్ని వెంటనే అమలు చేయాలని డిమాండ్ చేశారు.
కార్మికుల భద్రతకు రక్షణ పరికరాలు కల్పించాలి……
బొగ్గు గనుల్లో కార్మికుల భద్రతకు అత్యంత ప్రాధాన్యత ఇవ్వాల్సిన యాజమాన్యం, అవసరమైన రక్షణ పరికరాలను అందుబాటులో ఉంచడంలో విఫలమవుతోందని నాయకులు ఆరోపించారు. బూట్లు, హెల్మెట్లు, బిట్లు, డ్రిల్ రాడ్లు, SDL/LHD యంత్రాలు, HEMM యంత్రాలకు సంబంధించిన స్పేర్ పార్టులు, టైర్ల కొరత కారణంగా కార్మికుల భద్రతకు ముప్పు ఏర్పడటమే కాకుండా బొగ్గు ఉత్పత్తిపైనా ప్రతికూల ప్రభావం పడుతోందన్నారు. అవసరమైన పరికరాలు, యంత్ర సామగ్రిని తక్షణమే సరఫరా చేయాలని కోరారు.
రూ.59 వేల కోట్ల బకాయిలు వెంటనే చెల్లించాలి……..
TGGENCO, TGTRANSCO సంస్థల నుంచి సింగరేణికి రావాల్సిన సుమారు రూ.59 వేల కోట్ల బకాయిలను రాష్ట్ర ప్రభుత్వం తక్షణమే చెల్లించేలా చర్యలు తీసుకోవాలని ఏఐటీయూసీ నాయకులు డిమాండ్ చేశారు. ఈ బకాయిల చెల్లింపు సింగరేణి ఆర్థిక బలోపేతానికి, కార్మికుల సంక్షేమ పథకాల అమలుకు ఎంతో అవసరమని పేర్కొన్నారు.యూనియన్ల మధ్య పోటీ కార్మికుల ప్రయోజనాల కోసం ఉండాలే తప్ప, కార్మికులకు నష్టం కలిగించే విధంగా ఉండకూడదన్నారు. రాష్ట్ర ప్రభుత్వ రాజకీయ జోక్యంతో గుర్తింపు సంఘమైన ఏఐటీయూసీ, ఆర్‌ఎల్‌సీ సమక్షంలో యాజమాన్యంతో కుదుర్చుకున్న ఒప్పందాలను అమలు కాకుండా చేసే ప్రయత్నాలు జరుగుతున్నాయని ఆరోపించారు. ఈ విషయాన్ని కార్మికులు గమనించాలని కోరారు. సింగరేణిపై రాష్ట్ర ప్రభుత్వ రాజకీయ జోక్యం తగ్గించాలని, రూ.59 వేల కోట్ల బకాయిల చెల్లింపు కోసం ఐఎన్‌టీయూసీ నాయకులు సైతం ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకురావాలని పిలుపునిచ్చారు.
ఏఐటీయూసీ ప్రధాన డిమాండ్లు……
ప్రతి నెలా మెడికల్ బోర్డులు నిర్వహించి నిబంధనల ప్రకారం అర్హులైన కార్మికులకు ఉద్యోగాలు కల్పించాలి.మారుపేర్ల సమస్యలో పెండింగ్‌లో ఉన్న అర్హులైన అభ్యర్థులందరికీ, ముఖ్యంగా 35–40 ఏళ్ల వయస్సు గల వారికి న్యాయం చేయాలి.మిగిలిన అర్హులైన డిపెండెంట్ అభ్యర్థులకు తక్షణమే నియామక ఉత్తర్వులు జారీ చేయాలి.అర్హులైన సింగరేణి కార్మికులందరికీ సొంత ఇంటి పథకాన్ని అమలు చేయాలి.గనుల్లో కార్మికుల భద్రతకు అవసరమైన రక్షణ పరికరాలు, యంత్రాలు, స్పేర్ పార్టులను సరఫరా చేయాలి.TGGENCO, TGTRANSCO సంస్థల నుంచి రావాల్సిన సుమారు రూ.59 వేల కోట్ల బకాయిలను వెంటనే చెల్లించాలి.2026 ఆగస్టు 28న కుదిరిన ఒప్పందంలోని అన్ని అంశాలను అమలు చేయాలి.
కార్మికుల సమస్యల పరిష్కారంలో యాజమాన్యం ఇంకా నిర్లక్ష్యంగా వ్యవహరిస్తే, కార్మికుల హక్కుల పరిరక్షణ కోసం ఏఐటీయూసీ ఆధ్వర్యంలో మరిన్ని పోరాటాలు, ఆందోళన కార్యక్రమాలు చేపడతామని నాయకులు హెచ్చరించారు. సింగరేణి చైర్మన్, మేనేజింగ్ డైరెక్టర్ వ్యక్తిగతంగా జోక్యం చేసుకుని సంబంధిత అధికారులకు ఆదేశాలు జారీ చేసి, పెండింగ్ సమస్యలన్నింటినీ తక్షణమే పరిష్కరించాలని విజ్ఞప్తి చేశారు.అనంతరం వివిధ గనుల మేనేజర్లు, సంబంధిత విభాగాల అధికారులకు సీనియర్ కార్మిక నాయకుల ద్వారా సమస్యలతో కూడిన వినతిపత్రాలు అందజేశారు.
ఈ కార్యక్రమంలో ఏఐటీయూసీ బ్రాంచి నాయకులు సోమిశెట్టి రాజేశం, జాయింట్ సెక్రటరీ కంది శ్రీనివాస్, పెద్దపెళ్లి బానయ్య, ఎగ్గేటి రాజేశ్వరరావు, సీవీ రమణ, టేకుమట్ల తిరుపతి, పిట్ కార్యదర్శులు గాండ్ల సంపత్, మర్రి కుమారస్వామి, సీహెచ్‌పీ శర్మ, కలువల శ్రీనివాస్, పారిపెళ్లి సంజీవ్ కుమార్, ఆంటోనీ దినేష్, సంధ్యారాణి, బైరి సత్యనారాయణ, వర్క్‌మెన్ ఇన్‌స్పెక్టర్ ములకలపల్లి వెంకటేశ్వర్లు, విక్రమ్ సింగ్, సట్ల కొండయ్య, జువాజీ శ్రీనివాస్, బత్తిని రామన్న, కన్నం వేణు, పొన్నం శ్రీనివాస్, కుండ్రు వెంకటేష్, రామ్ రెడ్డి, ఊరకొండ శ్రీకాంత్, రాజేష్ కుమార్ యాదవ్, కోటయ్య, సారయ్య, పల్లె మల్లేష్, రామ్ చందర్, శెట్టి రాజేందర్, వెంకటేశ్వర్లు, ఓదమ్మ, బిక్షపతి, డొక్కు కృష్ణమూర్తి తదితరులతో పాటు కార్మిక సోదరులు, సోదరీమణులు అధిక సంఖ్యలో పాల్గొని గేట్ మీటింగ్‌లు, నిరసన కార్యక్రమాలు, వినతిపత్రాల సమర్పణ కార్యక్రమాలను విజయవంతం చేశారు.

