ఖాదీ వస్త్రాలపై 30 శాతం
ఇతర వస్త్రాలపై 20 శాతం రాయితీ
సింగరేణి ఉద్యోగులకు రూ.20 వేల వరకు క్రెడిట్ సౌకర్యం
కోల్ బెల్ట్ న్యూస్(మందమర్రి):
మందమర్రి ఏరియాలోని సీఈఆర్ క్లబ్ (CER Club) ప్రాంగణంలో శనివారం ఏర్పాటు చేసిన ఖాదీ మేళాను ఎస్ఓ టు జీఎం జి.ఎల్. ప్రసాద్ ముఖ్య అతిథిగా హాజరై అధికారికంగా ప్రారంభించారు.ఈ సందర్భంగా జి.ఎల్. ప్రసాద్ మాట్లాడుతూ.. స్వదేశీ ఉత్పత్తులను ప్రోత్సహించడం ప్రతి ఒక్కరి సామాజిక బాధ్యత అని పేర్కొన్నారు. చేనేత రంగానికి ప్రోత్సాహం అందించడంతో పాటు గ్రామీణ కళాకారులకు ఆర్థికంగా చేయూతనిచ్చేందుకు ఇటువంటి మేళాలు ఎంతగానో దోహదపడతాయని తెలిపారు.
ఈ నెల 31వ తేదీ నుంచి ప్రతిరోజూ ఉదయం 9 గంటల నుంచి రాత్రి 9 గంటల వరకు మేళా వినియోగదారులకు అందుబాటులో ఉంటుందని నిర్వాహకులు వెల్లడించారు. మేళాలో కొనుగోలు చేసే ఖాదీ వస్త్రాలపై 30 శాతం, పొందూరు ఖాదీ, కోసా సిల్క్, ఉన్ని వస్త్రాలపై 20 శాతం రాయితీ కల్పిస్తున్నట్లు తెలిపారు. మేళాలో నాణ్యమైన ఖాదీ వస్త్రాలు, టవల్స్, బెడ్‌షీట్లు, కలంకారి డ్రెస్ మెటీరియల్స్, లుంగీలు, కార్పెట్లతో పాటు స్వచ్ఛమైన తేనె, కుటీర పరిశ్రమల్లో తయారైన సబ్బులు, సువాసనల అగరబత్తులు, జీవశక్తి టానిక్, స్టీవియా పౌడర్ తదితర గ్రామోద్యోగ ఉత్పత్తులను ప్రదర్శన, విక్రయానికి అందుబాటులో ఉంచారు.
సింగరేణి కార్మికులు, ఉద్యోగుల సౌకర్యార్థం ప్రత్యేకంగా రూ.20 వేల వరకు క్రెడిట్‌పై ఖాదీ వస్త్రాలు కొనుగోలు చేసే అవకాశాన్ని నిర్వాహకులు కల్పించారు. కొనుగోలు చేసిన మొత్తాన్ని ఉద్యోగుల నెలవారీ వేతనం నుంచి ఐదు సులభ వాయిదాల్లో మినహాయించుకునే వెసులుబాటు కల్పించినట్లు పేర్కొన్నారు. మందమర్రి ఏరియాలోని సింగరేణి ఉద్యోగులు, వారి కుటుంబ సభ్యులు, గృహిణులు, స్థానిక ప్రజలు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని జి.ఎల్. ప్రసాద్ కోరారు. స్వదేశీ వస్తువులను కొనుగోలు చేయడం ద్వారా చేనేత కార్మికులకు, గ్రామీణ కళాకారులకు అండగా నిలవాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో డివైపీఎం (పర్సనల్) సందీప్, సీనియర్ పీఓ సత్యనారాయణ, మేళా ఇన్‌చార్జ్ చంద్రమౌళి, సంపత్, వెంకన్నతో పాటు పలువురు ఉద్యోగులు, స్థానిక ప్రజలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.

