హామీల అమలులో జాప్యం చేస్తే మరో పోరాటం తప్పదు
సీఐటీయూ నేత తుమ్మల రాజారెడ్డి
కోల్ బెల్ట్ న్యూస్(మందమర్రి):
సింగరేణి కార్మికులకు దసరా సందర్భంగా రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క ఇచ్చిన హామీలను దీపావళిలోపు అమలు చేయాలని సింగరేణి కాలరీస్ ఎంప్లాయీస్ యూనియన్ (సీఐటీయూ) జనరల్ సెక్రటరీ కామ్రేడ్ తుమ్మల రాజారెడ్డి డిమాండ్ చేశారు. సీఐటీయూ మందమర్రి బ్రాంచ్ అధ్యక్షుడు ఎస్. వెంకటస్వామి ఆధ్వర్యంలో కార్మికులను కలుసుకున్న అనంతరం ఆయన మాట్లాడారు.
సింగరేణి కార్మికులకు సొంతింటి కలను సాకారం చేయడంతో పాటు అలవెన్సులపై ఆదాయపు పన్ను మినహాయింపు, డిపెండెంట్లకు ఉద్యోగాలు కల్పించడం వంటి హామీలను ప్రభుత్వం వెంటనే అమలు చేయాలని కోరారు. సొంతింటి కోసం ఎదురుచూస్తూ రిటైర్ అయిన కార్మికులు సైతం ఉన్నారని, ఈ దీపావళి కానుకగా ఇంటి కలను నెరవేర్చి కార్మికుల కుటుంబాల్లో ఆనందాన్ని నింపాలని అన్నారు.
సొంతింటి సాధన కోసం గత నాలుగేళ్లుగా అనేక దఫాలుగా పోరాటాలు నిర్వహించామని తెలిపారు. వినతిపత్రాలు సమర్పించడం, ఆమరణ నిరాహార దీక్ష చేపట్టడం, బ్యాలెట్ ద్వారా ఓటింగ్ నిర్వహించడం వంటి కార్యక్రమాలతో కార్మికులందరినీ ఉద్యమంలో భాగస్వాములను చేశామని పేర్కొన్నారు. అయినప్పటికీ హామీల అమలులో జాప్యం జరిగితే మరో పోరాటానికి సిద్ధమవుతామని హెచ్చరించారు.
సింగరేణి ఆర్థిక బలోపేతానికి చర్యలు తీసుకోవాలి
బొగ్గు ఉత్పత్తిపై సమీక్షలు నిర్వహించడానికే పరిమితం కాకుండా, సంస్థకు రావాల్సిన బకాయిలను వెంటనే విడుదల చేసి సింగరేణిని ఆర్థికంగా బలోపేతం చేయాలని రాజారెడ్డి డిమాండ్ చేశారు. గత ప్రభుత్వ హయాంలో మాదిరిగా రాజకీయ జోక్యంతో సంస్థను ఆర్థికంగా దెబ్బతీసే ప్రయత్నాలు చేస్తే సహించేది లేదన్నారు. కొత్త గనులు కేటాయించామని గొప్పలు చెప్పుకుంటున్న కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఆ గనుల్లో సింగరేణి కార్మికులకే పని చేసే అవకాశం కల్పించాలని కోరారు.
మెడికల్ బోర్డు సమస్యలను పరిష్కరించాలి
ఏరియాలోనే మెడికల్ బోర్డులు నిర్వహిస్తామని ప్రకటించడం కంటే, ఇన్వాలిడేషన్ శాతాన్ని పెంచేందుకు తగిన చర్యలు తీసుకోవాలని అన్నారు. ఈ నెలలో ఇప్పటివరకు కార్మికులను మెడికల్ బోర్డుకు పిలవకపోవడంపై అసంతృప్తి వ్యక్తం చేశారు. ఒకసారి మెడికల్ బోర్డుకు హాజరైన కార్మికుడు తిరిగి మెడికల్ పరీక్షలకు రావాలంటే ఏడాది పాటు వేచి ఉండాలనే నిబంధనను సవరించాలని డిమాండ్ చేశారు. ప్రతినెలా నిర్వహించే మెడికల్ రివ్యూలో సర్ఫేస్ విధులకు తాత్కాలికంగా కేటాయిస్తున్న కార్మికుల ఆరోగ్య పరిస్థితిని పరిగణనలోకి తీసుకొని శాశ్వత పరిష్కారం చూపాలని కోరారు.
12వ వేతన ఒప్పందంపై కేంద్రం స్పందించాలి
12వ వేతన ఒప్పందం ఏర్పాటు అంశంపై కేంద్ర మంత్రి కిషన్రెడ్డి స్పందించాలని రాజారెడ్డి డిమాండ్ చేశారు. బొగ్గు కొరత నేపథ్యంలో కార్మికుల సమస్యలను పరిష్కరించడంలో నిర్లక్ష్యం కొనసాగితే అన్ని కార్మిక సంఘాలను కలుపుకొని మరో దీర్ఘకాలిక పోరాటానికి సమాయత్తమవుతామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో యూనియన్ డిప్యూటీ జనరల్ సెక్రటరీ అల్లి రాజేందర్, బ్రాంచ్ ఉపాధ్యక్షుడు లింగాల సత్యనారాయణ, మైన్ ఇన్చార్జి జడల ప్రవీణ్, పిట్ సెక్రటరీ రేగుల శ్రీనివాస్, కాంపల్లి నాగరాజు, అశోక్, శ్రీకాంత్తో పాటు పలువురు గని కార్మికులు పాల్గొన్నారు.

