ప్రజా ప్రతినిధులు, అధికారులు పట్టించుకోకపోవడంతో నిరసన
రహదారి శుభ్రం చేసిన యువత
కోల్ బెల్ట్ న్యూస్(కాసిపేట): గ్రామంలో పారిశుధ్య సమస్యలు తీవ్రంగా ఉన్నప్పటికీ ప్రజా ప్రతినిధులు, అధికారులు పట్టించుకోవడం లేదని నిరసన వ్యక్తం చేస్తూ యువత శ్రమదానం చేపట్టింది. గ్రామంలోని ప్రధాన రహదారిపై పేరుకుపోయిన చెత్తాచెదారం, పిచ్చిమొక్కలను తొలగించడంతో పాటు చెట్ల కొమ్మలను కత్తిరించి పరిసరాలను శుభ్రం చేశారు. వాటర్ ట్యాంక్ నుంచి ట్రాన్స్‌ఫార్మర్ వరకు ఉన్న ప్రధాన రహదారి వెంట పారిశుధ్య లోపాలు నెలకొన్నాయని, సమస్యలను పలుమార్లు ప్రజా ప్రతినిధులు, అధికారుల దృష్టికి తీసుకెళ్లినా పట్టించుకోకపోవడంతో నిరసనగా ఈ శ్రమదానం చేపట్టినట్లు యువత తెలిపారు.
అదేవిధంగా గ్రామంలోని అన్ని వాడల్లో మురికి కాలువలు, వీధులు చెత్తాచెదారం, పిచ్చిమొక్కలతో అపరిశుభ్రంగా మారాయని పేర్కొన్నారు. దీంతో దుర్వాసన వెదజల్లడంతో పాటు దోమల బెడద పెరిగిందని, గ్రామంలోని పెద్దలు, చిన్నారులు అనారోగ్యానికి గురవుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. తక్షణమే గ్రామంలో ప్రత్యేక పారిశుధ్య కార్యక్రమాలు చేపట్టి మురికి కాలువలను శుభ్రం చేయడంతో పాటు చెత్తాచెదారం, పిచ్చిమొక్కలను తొలగించి ప్రజల ఆరోగ్యాలను కాపాడాలని గ్రామ ప్రజా ప్రతినిధులు, అధికారులను కోరారు.
ఈ కార్యక్రమంలో సీపీఐ(ఎం) మంచిర్యాల జిల్లా కార్యదర్శి సంకె రవి, వార్డు సభ్యులు అజ్మీరా శ్రీనివాస్, మార్నేని మనీషా, భగత్‌సింగ్ యువజన సంఘం నాయకులు కనుకుల రాకేష్, చిలుముల శ్రీనివాస్, ఇస్లావత్ సాయి శివ, కనుకుల యశ్వంత్, అజ్మీరా రమేష్, అక్కేపల్లి సాయి, గోసుకుల అంజయ్య, గ్రామస్తులు దాగం దేవాజీ, కోటేసు తదితరులు పాల్గొన్నారు.

