16.6 C
Munich
Monday, July 27, 2026

స్మశానంలో బూడిదను ఎత్తుకెళుతున్న దొంగలు…ఎందుకో తెలుసా ?

Must read

coalbelt 24 News
coalbelt 24 Newshttps://coalbelt24news.com
COAL BELT NEWS, NIGAMA MEDIA Pvt Ltd , Mancherial, Telangana-504208, Mobile : 9603505050.

📰 Generate e-Paper Clip

చితి మంటలు ఆరక ముందే నీళ్లు చల్లి బూడిద ఎత్తుకెళ్లే ప్రయత్నం
జగిత్యాల జిల్లా మల్యాలలో ఘటన
అంత్యక్రియల ఆనవాయితీలను లక్ష్యంగా చేసుకున్న దొంగలు

కోల్ బెల్ట్ న్యూస్ (జగిత్యాల):

జగిత్యాల జిల్లా మల్యాల మండల కేంద్రంలో కలకలం రేపిన ఘటన చోటుచేసుకుంది. బంగారం కోసం గుర్తుతెలియని దుండగులు చితి మంటలు పూర్తిగా ఆరకముందే నీళ్లు పోసి ఆర్పి, బూడిదను సంచుల్లో నింపుకుని ఎత్తుకెళ్లేందుకు ప్రయత్నించిన సంఘటన స్థానికంగా తీవ్ర ఆందోళనకు దారితీసింది.

స్థానికుల కథనం ప్రకారం, మల్యాల మండల కేంద్రానికి చెందిన ఓ మహిళకు దహన సంస్కారాలు నిర్వహించారు. కుటుంబ సభ్యులు అంత్యక్రియలు ముగించుకుని అక్కడి నుంచి వెళ్లిపోయిన కొద్దిసేపటికే ఇద్దరు గుర్తుతెలియని వ్యక్తులు చితి వద్దకు చేరుకుని, మహిళ తల భాగంలో ఉన్న మంటలపై నీళ్లు పోసి ఆర్పివేశారు. అనంతరం బూడిదను సంచుల్లో నింపుకుని తీసుకెళ్లే ప్రయత్నం చేశారు. ఈ ఘటనను గమనించిన స్థానికులు వెంటనే వారిని అడ్డుకునేందుకు ప్రయత్నించగా, దుండగులు బూడిద సంచులను అక్కడే వదిలేసి పరారైనట్లు సమాచారం.

స్థానికుల వివరాల ప్రకారం, తెలంగాణలోని అనేక గ్రామీణ ప్రాంతాల్లో మహిళ మరణించినప్పుడు ఆమె మెడలో ఉండే నల్లపూసల తాడు నుంచి ఏదయినా ఒక చిన్న బంగారు వస్తువును తీసి మృతురాలి నోటిలో ఉంచి దహన సంస్కారాలు నిర్వహించడం ఆనవాయితీగా కొనసాగుతోంది. కొన్ని సామాజిక వర్గాల్లో మహిళలు ధరించిన వెండి మట్టెలు, కడియాలు వంటి ఆభరణాలను కూడా తొలగించకుండా దహనం చేసే సంప్రదాయం ఉంది.

ఈ సంప్రదాయాన్నే ఆసరాగా చేసుకుని కొందరు దుండగులు చితి పూర్తిగా చల్లారకముందే బూడిదను సంచుల్లో నింపుకుని, అందులోని బంగారం, వెండి వంటి విలువైన వస్తువులను వెతికి తీసి విక్రయిస్తున్నారని స్థానికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఈ ఘటనలో దాదాపు రూ.10 వేల విలువైన బంగారు గుండు కోసం ఈ ప్రయత్నం జరిగినట్లు తెలుస్తోంది.

ఒకవైపు కుటుంబ సభ్యులు తమ ఆత్మీయుడిని కోల్పోయిన విషాదంలో ఉండగా, మరోవైపు ఇలాంటి దారుణ ఘటనలు చోటుచేసుకోవడం పట్ల స్థానికులు తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. శ్మశానవాటికల్లో భద్రతను మరింత కట్టుదిట్టం చేయడంతో పాటు, ఇటువంటి ఘటనలు పునరావృతం కాకుండా పోలీసులు ప్రత్యేక నిఘా ఏర్పాటు చేయాలని ప్రజలు కోరుతున్నారు.

Author

More articles

Latest article

App Icon

Install CBN News App

Add to home screen for faster loading and latest updates.