Arrest : కోడి పందాలతో పట్టుబడితే కోళ్లతో పాటు పందెం లో పాల్గొన్న వారిని అరెస్ట్ చేసిన సంఘటనలు చూసాం. పందెం కాసిన వాళ్ళు పారిపోతే కోళ్లను పోలీసులు పట్టుకొని కేసు నమోదు చేసిన సంఘటనలు చూసాం. విన్నాం. కానీ ఇప్పుడు ఒక విచిత్రమైన సంఘటన జరిగింది. పోలీసులు గుర్రాన్ని అరెస్టు చేసిన సంఘటన తాజాగా జరిగింది. ఇది వినడానికి విచిత్రంగా ఉన్నప్పట్టికీ జరిగింది అక్షరాలా వాస్తవం.
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రము ఎన్టీఆర్ జిల్లా జగ్గయ్యపేట నియోజకవర్గం వత్సవాయిలో కొందరు గుర్తుతెలియని వ్యక్తులు గంజాయి అమ్ముతున్నట్టుగా, సేవిస్తున్నట్టుగా స్థానిక పోలీసులకు సమాచారం అందింది. దింతో వెంటనే పోలీస్ సిబ్బంది అక్కడికి చేరుకున్నారు. పోలీసులను చూసిన వ్యక్తులు అక్కడి నుంచి పారిపోయారు. కానీ పోలీసులకు అక్కడ ఒక గుర్రం మాత్రం కనిపించింది.
వాహనాల ద్వారా గంజాయి తరలిస్తే పట్టుబడుతున్నామని స్మగ్లర్లు గుర్రాన్ని ఎంచుకున్నారని పోలీసులకు అనుమానం వచ్చింది. దింతో పోలీసులు గుర్రాన్ని తీసుకువచ్చి పోలీస్ స్టేషన్ లో కట్టేశారు. ఇప్పుడు గుర్రాన్ని అరెస్ట్ చేయడం పెద్ద టాక్ అయ్యింది. వ్యక్తులను అరెస్ట్ చేస్తే వాళ్లకు సంబందించిన వారు ఆకలి తీరుస్తారు. గుర్రానికి వచ్చేవారు లేరు. కాబట్టి పోలీసులే గుర్రానికి మేత వేసి ఆకలి తీరుస్తున్నారు.