రైతులకు నష్టపరిహారం చెల్లించాలి..
నిత్యావసర ధరలను నియంత్రించాలి
నవంబర్ 10న కలెక్టరేట్ ఎదుట సీపీఐ ఆధ్వర్యంలో ధర్నా
కోల్ బెల్ట్ న్యూస్(బెల్లంపల్లి):
ఎల్‌నినో ప్రభావంతో తీవ్ర వర్షాభావ పరిస్థితులు నెలకొని, నీటి ఎద్దడి కారణంగా పంటలు దెబ్బతిని రైతులు తీవ్రంగా నష్టపోతున్న నేపథ్యంలో మంచిర్యాల జిల్లాలోని అన్ని మండలాలను కరువు ప్రాంతాలుగా ప్రకటించాలని భారత కమ్యూనిస్టు పార్టీ (సీపీఐ) నాయకులు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఈ మేరకు నవంబర్ 10న మంచిర్యాల కలెక్టరేట్ ఎదుట నిర్వహించనున్న చలో కలెక్టరేట్ ధర్నాకు సంబంధించిన కరపత్రాలను గురువారం బెల్లంపల్లిలోని సీపీఐ కార్యాలయంలో విడుదల చేశారు.ఈ సందర్భంగా సీపీఐ మంచిర్యాల జిల్లా కార్యదర్శి రామడుగు లక్ష్మణ్, బెల్లంపల్లి నియోజకవర్గ కార్యదర్శి దాగం మల్లేష్, జిల్లా కార్యవర్గ సభ్యుడు చిప్ప నరసయ్య, పట్టణ కార్యదర్శి ఆడపు రాజమౌళి మాట్లాడుతూ.. ఎల్‌నినో ప్రభావంతో జిల్లాలో తీవ్ర నీటి ఎద్దడి ఏర్పడి సాగు పంటలు దెబ్బతిన్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. పెట్టుబడులు పెట్టి సాగు చేసిన రైతులతో పాటు కౌలు రైతులు సైతం తీవ్రంగా నష్టపోయారని తెలిపారు. ప్రభుత్వం తక్షణమే స్పందించి మంచిర్యాల జిల్లాలోని అన్ని మండలాలను కరువు ప్రభావిత ప్రాంతాలుగా ప్రకటించి, బాధిత రైతులకు తగిన నష్టపరిహారం అందించాలని డిమాండ్ చేశారు.
కరువు పరిస్థితులను ఆసరాగా చేసుకుని వ్యాపారులు నిత్యావసర సరుకులను నిల్వ చేసి బ్లాక్ మార్కెటింగ్‌కు పాల్పడే అవకాశం ఉందని, దీనివల్ల ధరలు మరింత పెరిగి సామాన్య ప్రజలపై ఆర్థిక భారం పడుతుందని హెచ్చరించారు. ప్రభుత్వం ప్రత్యేక నిఘా ఏర్పాటు చేసి నిత్యావసర వస్తువుల ధరలను తక్షణమే నియంత్రించాలని కోరారు.అలాగే తెల్ల రేషన్ కార్డుదారులందరికీ నిత్యావసర సరుకులను ఉచితంగా పంపిణీ చేయాలని, రైతుల పంట రుణాలను మాఫీ చేయాలని, పశువుల పోషణ కోసం అవసరమైన మేత, తాగునీటిని అందించి పశుపోషకులను ఆదుకోవాలని డిమాండ్ చేశారు. జిల్లాలో నెలకొన్న సాగునీరు, తాగునీటి సమస్యలను పరిష్కరించేందుకు ప్రభుత్వం తక్షణ చర్యలు చేపట్టాలని కోరారు.
రైతులు, కౌలు రైతులు, వ్యవసాయ కార్మికులు, సామాన్య ప్రజల సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లేందుకు నవంబర్ 10న మంచిర్యాల కలెక్టరేట్ ఎదుట నిర్వహించే ధర్నాలో ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొని విజయవంతం చేయాలని సీపీఐ నాయకులు పిలుపునిచ్చారు. పార్టీ శ్రేణులు, కార్యకర్తలు ప్రజలను సమీకరించి కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని కోరారు.ఈ కార్యక్రమంలో పట్టణ సహాయ కార్యదర్శి బొల్లం తిలక్ అంబేద్కర్, మండల కార్యదర్శి బొంతల లక్ష్మీనారాయణ, జిల్లా సమితి సభ్యులు రత్నం రాజం, మేకల రాజేశం, నాయకులు కే. తిరుపతి, జి. మహేందర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

