అధికారులకు జిల్లా అదనపు కలెక్టర్ వి. రాములు ఆదేశం
కోల్ బెల్ట్ న్యూస్(మంచిర్యాల):
జిల్లాలో కొనసాగుతున్న భూ రీ సర్వే పనులు, ప్రభుత్వ భూముల క్రమబద్ధీకరణతో పాటు ఎస్ఐఆర్ ప్రక్రియను వేగవంతం చేసి, నిర్ణీత గడువులోగా పూర్తి చేయాలని జిల్లా అదనపు కలెక్టర్ (రెవెన్యూ) వి. రాములు సంబంధిత అధికారులను ఆదేశించారు.
బుధవారం మందమర్రి మండలంలో పర్యటించిన ఆయన క్షేత్రస్థాయిలో కొనసాగుతున్న రీ సర్వే పనులను పరిశీలించారు. ఈ సందర్భంగా పనుల పురోగతిని అధికారులను అడిగి తెలుసుకున్నారు. రీ సర్వే ప్రక్రియలో నిర్దేశించిన లక్ష్యాలను ప్రణాళికాబద్ధంగా పూర్తి చేస్తూ, ఎలాంటి జాప్యం లేకుండా నిర్ణీత గడువులోగా పనులు ముగించాలని సూచించారు.అనంతరం మందమర్రి మండల తహసీల్దార్ కార్యాలయాన్ని సందర్శించి, వివిధ రెవెన్యూ కార్యక్రమాల అమలుపై సమీక్ష నిర్వహించారు. జీఓ ఎంఎస్ నంబర్లు 76, 59, 58 కింద చేపడుతున్న భూముల క్రమబద్ధీకరణ పనుల పురోగతిని పరిశీలించారు. అలాగే ఎస్ఐఆర్ ప్రక్రియను వేగవంతం చేసి నిర్దేశిత లక్ష్యాలను సాధించాలని అధికారులకు స్పష్టం చేశారు.
భూ భారతి కింద అందిన దరఖాస్తులను ఎప్పటికప్పుడు పరిశీలించాలని, మీ-సేవ ద్వారా జారీ చేయాల్సిన పెండింగ్ ధ్రువపత్రాలను సత్వరమే పరిష్కరించాలని ఆదేశించారు. దరఖాస్తుదారులు కార్యాలయాల చుట్టూ తిరగకుండా నిర్ణీత సమయంలోనే ధ్రువపత్రాలు అందేలా అధికారులు ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలని సూచించారు.ప్రభుత్వ భూముల క్రమబద్ధీకరణ, రెవెన్యూ సేవలు, రీ సర్వే వంటి కీలక కార్యక్రమాల్లో నిర్లక్ష్యానికి తావులేకుండా బాధ్యతాయుతంగా విధులు నిర్వహించాలని అదనపు కలెక్టర్ అధికారులకు సూచించారు.ఈ పర్యటనలో మందమర్రి మండల తహసీల్దార్ సతీష్ కుమార్, సంబంధిత రెవెన్యూ అధికారులు తదితరులు పాల్గొన్నారు.

