TRS పెద్దపల్లి జిల్లా అధ్యక్షురాలు సిరవేన స్వప్న ముదిరాజ్
కోల్ బెల్ట్ న్యూస్(పెద్దపల్లి):
ఆదిలాబాద్ జిల్లా ఇంద్రవెల్లిలో అక్టోబర్ 30న తెలంగాణ రక్షణ సేన ఆధ్వర్యంలో నిర్వహించనున్న పాంచజన్య సంకల్ప సభను విజయవంతం చేయాలని ఆ పార్టీ పెద్దపల్లి జిల్లా అధ్యక్షురాలు సిరవేన స్వప్న ముదిరాజ్ పిలుపునిచ్చారు. మంగళవారం పెద్దపల్లిలో సభకు సంబంధించిన పోస్టర్లను ఆమె ఆవిష్కరించారు.ఈ సందర్భంగా స్వప్న ముదిరాజ్ మాట్లాడుతూ తెలంగాణ రక్షణ సేన అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత ఆధ్వర్యంలో నిర్వహించనున్న ఈ సభకు తెలంగాణ ప్రజలు, యువత, మహిళలు, నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో తరలిరావాలని కోరారు. రాష్ట్రంలో ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలు, జరుగుతున్న అన్యాయాలు, అక్రమాలను ప్రజల దృష్టికి తీసుకురావడంతో పాటు తెలంగాణ ప్రజల ఆకాంక్షలను ప్రతిబింబించేలా ఇంద్రవెల్లి వేదికగా భారీ బహిరంగ సభ నిర్వహిస్తున్నట్లు తెలిపారు.
ఆదివాసీల పోరాట స్ఫూర్తికి ఇంద్రవెల్లి ప్రతీక….
తెలంగాణ ఆదివాసీల చరిత్రలో ఇంద్రవెల్లికి ప్రత్యేక స్థానం ఉందని స్వప్న ముదిరాజ్ పేర్కొన్నారు. 1981 ఏప్రిల్ 20న ఆదివాసీల భూమి హక్కులు, సమస్యలపై నిర్వహించ తలపెట్టిన సమావేశం సందర్భంగా జరిగిన పోలీసు కాల్పుల్లో పలువురు ఆదివాసీలు ప్రాణాలు కోల్పోయిన విషాద ఘటనను గుర్తుచేశారు. ఆ ఘటనకు గుర్తుగా ఏర్పాటైన అమరవీరుల స్తూపం ఆదివాసీల హక్కులు, ఆత్మగౌరవం, సామాజిక న్యాయం కోసం సాగిన పోరాటానికి ప్రతీకగా నిలుస్తోందన్నారు.ఇంద్రవెల్లి చారిత్రక నేపథ్యాన్ని స్ఫూర్తిగా తీసుకొని ప్రజా సమస్యలపై చైతన్యం కల్పించేందుకు పాంచజన్య సంకల్ప సభ నిర్వహిస్తున్నట్లు వివరించారు. తెలంగాణ ప్రజల ఆత్మగౌరవం, సామాజిక న్యాయం, రాష్ట్ర అభివృద్ధి, యువతకు ఉపాధి అవకాశాలు, మహిళల సంక్షేమం, బడుగు బలహీన వర్గాల అభ్యున్నతికి ప్రాధాన్యత కల్పించాల్సిన అవసరం ఉందని అన్నారు.
పెద్దపల్లి జిల్లా నుంచి భారీగా తరలిరావాలి……..
సభ విజయవంతానికి తెలంగాణ రక్షణ సేన నాయకులు, కార్యకర్తలు, అభిమానులు సమన్వయంతో పనిచేయాలని ఆమె సూచించారు. పెద్దపల్లి జిల్లా నుంచి ప్రజలు అధిక సంఖ్యలో ఇంద్రవెల్లికి తరలివచ్చి పాంచజన్య సంకల్ప సభలో పాల్గొని విజయవంతం చేయాలని సిరవేన స్వప్న ముదిరాజ్ విజ్ఞప్తి చేశారు.ఈ కార్యక్రమంలో తెలంగాణ రక్షణ సేన పెద్దపల్లి నియోజకవర్గ ఇన్‌చార్జి సలేంద్ర కొమురయ్య, బొంగొని శంకర్ గౌడ్, ఉస్తం శ్రీనివాస్ ముదిరాజ్, కారుపాకుల రమేష్, కాల్వల రవీందర్, చిట్టి మల్ల హనుమండ్లు, దాసరి అంజలి, సాగర్ల వాసవి, కూన రవళి, మాటం మల్లికార్జున్, సాగర్ల శశాంత్, చిలుక ఆనంద్, ఎద్దు లక్ష్మీనారాయణ తదితరులు పాల్గొన్నారు.

