ఏఐటీయూసీ ఆధ్వర్యంలో ‘చలో హైదరాబాద్’
తరలిన మందమర్రి బ్రాంచి నాయకులు, కార్మికులు
కోల్ బెల్ట్ న్యూస్(మందమర్రి):
సింగరేణి సంస్థకు ప్రభుత్వ రంగ సంస్థ జెన్‌కో నుంచి రావాల్సిన రూ.59 వేల కోట్ల బకాయిలను వెంటనే చెల్లించాలని డిమాండ్ చేస్తూ సింగరేణి కాలరీస్ వర్కర్స్ యూనియన్ (ఏఐటీయూసీ) చేపట్టిన ఆందోళనల్లో భాగంగా మంగళవారం నిర్వహించిన ‘చలో హైదరాబాద్’ కార్యక్రమానికి మందమర్రి బ్రాంచి నుంచి సుమారు 50 మంది నాయకులు, కార్మికులు బస్సులో తరలివెళ్లారు. బ్రాంచి కార్యదర్శి శైలేంద్ర సత్యనారాయణ, బ్రాంచి ఉపాధ్యక్షుడు భీమనాధుని సుదర్శన్ ఆధ్వర్యంలో బ్రాంచి కమిటీ సభ్యులు, వివిధ గనులు, డిపార్ట్‌మెంట్ల పిట్ కార్యదర్శులు, కమిటీ సభ్యులు ఈ కార్యక్రమంలో పాల్గొనేందుకు బయలుదేరారు.
ఈ సందర్భంగా బ్రాంచి కార్యదర్శి శైలేంద్ర సత్యనారాయణ మాట్లాడుతూ.. గత టీఆర్‌ఎస్ (ప్రస్తుత బీఆర్‌ఎస్) ప్రభుత్వం సింగరేణి సంస్థలో రాజకీయ జోక్యాన్ని పెంచి, సంస్థ నిధులను విచ్చలవిడిగా వినియోగించడం ద్వారా సంస్థను నష్టాల బాట పట్టించిందని విమర్శించారు. ఆ ప్రభుత్వం ఒక్క కొత్త గనిని కూడా ప్రారంభించలేకపోయిందని ఆరోపించారు. ప్రస్తుతం అధికారంలో ఉన్న కాంగ్రెస్ ప్రభుత్వం కూడా రాజకీయ జోక్యాన్ని పెంచుతూ, సంస్థను మరింత నిర్వీర్యం చేసే విధంగా వ్యవహరిస్తోందని విమర్శించారు.

గనుల్లో కార్మికులకు అవసరమైన రక్షణ పరికరాలు, సరైన మెటీరియల్ అందుబాటులో లేకపోవడం ఆందోళనకరమని పేర్కొన్నారు. కార్మికుల కష్టార్జితంతో సంస్థకు లాభాలు వచ్చినప్పటికీ, వారికి లాభాల వాటాను ప్రకటించకపోవడం విచారకరమన్నారు. కనీసం కార్మికులకు జీతాలు చెల్లించేందుకు కూడా ఇబ్బందులు ఎదురయ్యే పరిస్థితులు ఏర్పడుతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు.
ఈ సమస్యల పరిష్కారం కోసం ఏఐటీయూసీ ఆధ్వర్యంలో హైదరాబాద్‌లోని విద్యుత్ సౌధ వద్ద భారీ ఆందోళన, ధర్నా నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ప్రభుత్వం తన వైఖరిని మార్చుకుని సింగరేణి కార్మికులకు లాభాల వాటాను ప్రకటించాలని, జెన్‌కో నుంచి సింగరేణికి రావాల్సిన బకాయిలను వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేశారు. ప్రభుత్వం స్పందించని పక్షంలో ఆందోళనలను మరింత ఉధృతం చేస్తామని హెచ్చరించారు.
ఈ కార్యక్రమంలో బ్రాంచి ఉపాధ్యక్షుడు భీమనాధుని సుదర్శన్, బ్రాంచి సహాయ కార్యదర్శి సోమిశెట్టి రాజేశం, జాయింట్ సెక్రటరీ కంది శ్రీనివాస్, ఏరియా నాయకులు ఎగ్గేటి రాజేశ్వరరావు, గోపతి సత్యనారాయణ, మైనింగ్ స్టాఫ్ నాయకులు రాజేష్ కుమార్ యాదవ్, జి. సుదర్శన్ రెడ్డి, పిట్ కార్యదర్శులు గాండ్ల సంపత్, మర్రి కుమారస్వామి, కలవల శ్రీనివాస్, పారిపెల్లి సంజీవ్ కుమార్, మైన్ కమిటీ, సేఫ్టీ కమిటీ సభ్యులు కొండ్రు వెంకటేష్, శివాజీ శ్రీనివాస్, రవి, తిరుపతి, ముల్కల్ల శ్రీనివాస్, కానుగంటి తిరుపతి, మాదారపు రమేష్, వెంకటేశ్వర్లు, వి. పద్మారావు, కాటమ్ సత్యనారాయణ తదితర నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

