NIGAMA MEDIA (P) LTD
14.2 C
Munich

NIGAMA MEDIA (P) LTD

Thursday, October 8, 2026

ప్రజా సంక్షేమం, అభివృద్ధికి అందరూ సహకరించాలి

Must read

coalbelt 24 News
coalbelt 24 Newshttps://coalbelt24news.com
COAL BELT NEWS, NIGAMA MEDIA Pvt Ltd , Mancherial, Telangana-504208, Mobile : 9603505050.

📰 Generate e-Paper Clip

మంత్రి గడ్డం వివేకానంద

కోల్ బెల్ట్ న్యూస్(మందమర్రి):

ప్రజా సంక్షేమం, గ్రామాల అభివృద్ధి కోసం ప్రభుత్వం చేపడుతున్న కార్యక్రమాలకు ప్రజలందరూ రాజకీయాలకు అతీతంగా సహకరించాలని రాష్ట్ర కార్మిక, ఉపాధి శిక్షణ, కర్మాగారాలు, గనులు–భూగర్భ శాఖ మంత్రి గడ్డం వివేకానంద కోరారు. బుధవారం మందమర్రి మండలం వెంకటాపూర్‌లో 33 కేవీ విద్యుత్ సబ్‌స్టేషన్ నిర్మాణానికి అధికారులు, ప్రజాప్రతినిధులతో కలిసి శంకుస్థాపన చేశారు.

ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ సుమారు రూ.3 కోట్లతో నిర్మించనున్న సబ్‌స్టేషన్‌తో భవిష్యత్ విద్యుత్ అవసరాలు తీరనున్నాయని తెలిపారు. భూమి కేటాయింపుపై ఉన్న అభ్యంతరాలను గ్రామ ప్రజల సహకారంతో పరిష్కరించుకోవాలని సూచించారు. అర్హులైన పేదలకు ఉచిత విద్యుత్ కనెక్షన్లు, ఇందిరమ్మ ఇళ్లు, పెన్షన్లు, మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం వంటి సంక్షేమ పథకాలు అమలు చేస్తున్నట్లు తెలిపారు.

వెంకటాపూర్‌లో 32 ఇందిరమ్మ ఇళ్లు, 38 పెన్షన్లు మంజూరైనట్లు వెల్లడించారు. విద్యారంగ అభివృద్ధిలో భాగంగా ప్రభుత్వ పాఠశాలల్లో ఉపాధ్యాయ నియామకాలు చేపట్టడంతో పాటు నియోజకవర్గంలో సుమారు రూ.100 కోట్లతో 2,500 మంది విద్యార్థులకు వసతితో కూడిన ప్రత్యేక విద్యాసంస్థ ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు. ఆరోగ్యశ్రీ ద్వారా రూ.10 లక్షల వరకు ఉచిత వైద్యం, అవసరమైన వారికి ముఖ్యమంత్రి సహాయనిధి ద్వారా ఆర్థిక సాయం అందిస్తున్నామని పేర్కొన్నారు.

ఎమ్మెల్యే కాలనీ నుంచి ఆర్‌కె-5 వరకు 4.7 కిలోమీటర్ల రహదారి నిర్మాణానికి రూ.4.85 కోట్లు మంజూరయ్యాయని, గ్రామాల్లో హైమాస్ట్ లైట్లు ఏర్పాటు చేస్తున్నామని తెలిపారు. యువతకు జర్మన్ భాషలో శిక్షణ ఇచ్చి జర్మనీలో ఉద్యోగ అవకాశాలు కల్పించే కార్యక్రమం కొనసాగుతోందని, ప్రస్తుతం సుమారు 70 మంది శిక్షణ పొందుతున్నారని చెప్పారు. నస్పూర్‌లో జరిగిన రోడ్డు ప్రమాదంలో మృతి చెందిన వెంకటాపూర్ గ్రామస్థులకు మంత్రి, అధికారులు, ప్రజాప్రతినిధులు రెండు నిమిషాలు మౌనం పాటించి సంతాపం తెలిపారు.

అనంతరం మందమర్రి మున్సిపాలిటీలో 14వ వార్డులో యూఐడీఎఫ్ నిధులతో అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేశారు. 24 వార్డుల పరిధిలో సుమారు రూ.15 కోట్లతో పనులు చేపడుతున్నామని, త్వరలో మరో రూ.40 కోట్లతో వివిధ అభివృద్ధి పనులు ప్రారంభిస్తామని మంత్రి తెలిపారు. అమృత్ పథకం ద్వారా ఇంటింటికీ నల్లా కనెక్షన్లు, సీసీ డ్రైనేజీ నిర్మాణంతో పట్టణంలో తాగునీరు, పారిశుద్ధ్య సదుపాయాలను మెరుగుపరుస్తామని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో సంబంధిత అధికారులు, ప్రజాప్రతినిధులు, గ్రామస్థులు పాల్గొన్నారు.

More articles

Latest article

App Icon

Install CBN News App

Add to home screen for faster loading and latest updates.