ఖానాపూర్ నియోజకవర్గానికి చెందిన పలువురు సర్పంచులు, నాయకులు కూడా చేరిక
కోల్ బెల్ట్ న్యూస్ ప్రతినిధి:
నిర్మల్ జిల్లా బీజేపీ ఎస్టీ మోర్చా అధ్యక్షుడు సుంచు ఎల్లయ్య టీఆర్ఎస్ పార్టీలో చేరారు. ఖానాపూర్ అసెంబ్లీ నియోజకవర్గానికి చెందిన పలువురు సర్పంచులు, ఉప సర్పంచులు, మాజీ ఎంపీటీసీ సభ్యులు, మాజీ సర్పంచులు, వివిధ సామాజిక సంఘాల నాయకులతో కలిసి బుధవారం ఆయన టీఆర్ఎస్‌లో చేరారు. బంజారాహిల్స్‌లోని టీఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో నిర్వహించిన కార్యక్రమంలో పార్టీ అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత వారికి పార్టీ కండువాలు కప్పి సాదరంగా ఆహ్వానించారు. ఈ సందర్భంగా నిర్మల్ జిల్లాతో పాటు ఖానాపూర్ నియోజకవర్గంలో టీఆర్ఎస్ పార్టీని మరింత బలోపేతం చేసేందుకు నాయకులంతా సమన్వయంతో పనిచేయాలని కవిత సూచించారు.

పార్టీ కార్యక్రమాలను ప్రజల్లోకి విస్తృతంగా తీసుకెళ్లాలని, కార్యకర్తలు, నాయకులు ఐక్యంగా పనిచేయాలని ఆమె పేర్కొన్నారు. ఈ నెలలో ఇంద్రవెల్లిలో నిర్వహించనున్న పాంచజన్య సంకల్ప సభను విజయవంతం చేసేందుకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని కవిత పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో సర్పంచులు టేకం లక్ష్మణ్, గడ్డం భీముడు, కె. రాజేందర్, కస్తూరి అర్జున్, శ్రీపెల్లి శేఖర్, ఉప సర్పంచులు పి. రాజు, చింటు కాంతి, గంపల భూమన్న, మాజీ ఎంపీటీసీ సభ్యులు రామ్ సింగ్, షిండే సదాశివ, మాజీ సర్పంచులు ఎ. శంకర్, నాయకపోడ్, కోలం, బంజారా సంఘాల ప్రముఖులు, నాయకులు పాల్గొని టీఆర్ఎస్‌లో చేరారు.

