CEC వెంటనే రాజీనామా చేయాలి: మంత్రి వివేక్ వెంకటస్వామి
కోల్ బెల్ట్ న్యూస్(మందమర్రి):
ఓట్ల తొలగింపు ప్రక్రియలో జరిగినట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్న అవకతవకలకు నిరసనగా మందమర్రి పట్టణంలో కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో గురువారం భారీ ధర్నా, నిరసన కార్యక్రమం నిర్వహించారు. తెలంగాణ రాష్ట్ర కార్మిక, గనుల శాఖ మంత్రి డా. గడ్డం వివేక్ వెంకటస్వామి పిలుపు మేరకు పట్టణంలోని పాత బస్టాండ్ ఫ్లైఓవర్ బ్రిడ్జి కింద ఈ కార్యక్రమాన్ని చేపట్టారు.
ఈ సందర్భంగా మంత్రి వివేక్ వెంకటస్వామి ధర్నాలో పాల్గొని కేంద్ర ప్రభుత్వ వైఖరిపై తీవ్ర స్థాయిలో నిరసన వ్యక్తం చేశారు. ఓట్ల తొలగింపు ప్రక్రియలో అవకతవకలు జరిగాయని ఆరోపిస్తూ, ఇందుకు బాధ్యత వహిస్తూ కేంద్ర ఎన్నికల సంఘం (CEC) వెంటనే రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు.
ప్రజాస్వామ్యంలో ఓటు హక్కు అత్యంత కీలకమైనదని, ప్రతి పౌరుడి ఓటు హక్కును కాపాడటం ప్రతి ఒక్కరి బాధ్యత అని కాంగ్రెస్ నాయకులు పేర్కొన్నారు. ప్రజల ఓటు హక్కును దెబ్బతీసే ఎలాంటి చర్యలను సహించేది లేదని స్పష్టం చేశారు. ఓటు హక్కు పరిరక్షణ కోసం కాంగ్రెస్ పార్టీ నిరంతరం పోరాటం కొనసాగిస్తుందని తెలిపారు. కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా కాంగ్రెస్ శ్రేణులు పెద్ద ఎత్తున నినాదాలు చేస్తూ తమ నిరసనను వ్యక్తం చేశారు. ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం భవిష్యత్తులో ఉద్యమాన్ని మరింత ఉధృతం చేస్తామని నాయకులు ప్రకటించారు.
ఈ కార్యక్రమంలో చెన్నూరు నియోజకవర్గానికి చెందిన కాంగ్రెస్ పార్టీ సర్పంచులు, మాజీ జెడ్పీటీసీలు, మాజీ ఎంపీటీసీలు, మందమర్రి పట్టణ కాంగ్రెస్ కమిటీ నాయకులు, సీనియర్ నాయకులు, యూత్ కాంగ్రెస్, మహిళా కాంగ్రెస్, మైనారిటీ విభాగం, అనుబంధ సంఘాల నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

