NIGAMA MEDIA (P) LTD
11.3 C
Munich

NIGAMA MEDIA (P) LTD

Wednesday, October 7, 2026

మందమర్రి ఏరియా బొగ్గు ఉత్పత్తి లక్ష్యంపై సమీక్ష సమావేశం

Must read

coalbelt 24 News
coalbelt 24 Newshttps://coalbelt24news.com
COAL BELT NEWS, NIGAMA MEDIA Pvt Ltd , Mancherial, Telangana-504208, Mobile : 9603505050.

📰 Generate e-Paper Clip

కోల్ బెల్ట్ న్యూస్ (మందమర్రి):

మందమర్రి ఏరియాలో 2026-27, 2027-28 ఆర్థిక సంవత్సరాలకు నిర్దేశించిన బొగ్గు ఉత్పత్తి, ఓవర్‌బర్డెన్ (ఓబీ) తొలగింపు, గనుల అభివృద్ధి లక్ష్యాల సాధనపై ఆన్యువల్ ప్లాన్ కమిటీ, టార్గెట్ కమిటీ ఉన్నతస్థాయి సమీక్షా సమావేశం మంగళవారం మందమర్రి ఏరియా జనరల్ మేనేజర్ కార్యాలయ కాన్ఫరెన్స్ హాల్లో నిర్వహించారు. కార్పొరేట్ కార్యాలయం నుంచి విచ్చేసిన కమిటీ సభ్యులు జనరల్ మేనేజర్లు దేవేందర్, నరసింహారావు, డీజీఎం గాబ్రియేల్‌రాజు, గని మేనేజర్ ప్రసాద్‌తో పాటు ఏడుగురు అసోసియేటెడ్ అధికారులు సమావేశంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా మందమర్రి ఏరియా జనరల్ మేనేజర్ ఎన్. రాధాకృష్ణ ఆధ్వర్యంలో ఏరియా ఉన్నతాధికారులు కమిటీ సభ్యులకు ఘన స్వాగతం పలికారు.

2026-27 ఆర్థిక సంవత్సరంలో ఇప్పటివరకు సాధించిన నెలవారీ బొగ్గు ఉత్పత్తి, ఓవర్‌బర్డెన్ తొలగింపు పురోగతిని కమిటీ సమీక్షించింది. రానున్న నెలల్లో సాధించాల్సిన లక్ష్యాలు, వాటి కోసం చేపట్టాల్సిన చర్యలపై అధికారులను వివరాలు అడిగి తెలుసుకుంది. అలాగే 2027-28 ఆర్థిక సంవత్సరానికి ప్రతిపాదించిన బొగ్గు ఉత్పత్తి లక్ష్యాలు, వాటి సాధనకు రూపొందించిన కార్యాచరణ ప్రణాళికపై సమగ్రంగా చర్చించారు. ఓపెన్‌కాస్ట్ ప్రాజెక్టుల్లో బొగ్గు ఉత్పత్తి, ఓబీ తొలగింపు లక్ష్యాలతో పాటు అండర్‌గ్రౌండ్ గనుల్లో గనుల అభివృద్ధి, డిపిల్లరింగ్ పనుల పురోగతిని కమిటీ పరిశీలించింది. ఉద్యోగులు, కార్మికుల సంఖ్య, వారి ఉత్పాదకత, గనుల్లో వినియోగిస్తున్న భారీ యంత్రాల పనితీరు, వాటి గరిష్ట సామర్థ్య వినియోగంపై అధికారులకు పలు సూచనలు, ఆదేశాలు జారీ చేశారు.

గనుల విస్తరణకు కీలకమైన భూసేకరణ, పునరావాసం, పునరావాస ప్యాకేజీ (ఆర్‌అండ్‌ఆర్) స్థితిగతులు, పర్యావరణ అనుమతులు (ఈసీ), అటవీ శాఖ అనుమతుల ప్రస్తుత పరిస్థితిపై కూడా సమీక్ష నిర్వహించారు. లక్ష్య సాధనలో ఎదురవుతున్న సాంకేతిక, క్షేత్రస్థాయి సమస్యలను గుర్తించి, వాటి పరిష్కారానికి అవసరమైన వనరులు, కార్పొరేట్ స్థాయి సహకారం అందిస్తామని కమిటీ సభ్యులు తెలిపారు. సమీక్షా సమావేశంలో మందమర్రి ఏరియాలోని వివిధ గనుల ఏజెంట్లు, ప్రాజెక్టు అధికారులు, గని మేనేజర్లు, వివిధ విభాగాల అధిపతులు, అధికారులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

More articles

Latest article

App Icon

Install CBN News App

Add to home screen for faster loading and latest updates.