ఫాగింగ్, పారిశుద్ధ్య పనులు ముమ్మరం
దోమల నివారణలో ప్రజలూ భాగస్వాములు కావాలి
మందమర్రి మున్సిపల్ కమిషనర్ రాజలింగు పిలుపు
కోల్ బెల్ట్ న్యూస్(మందమర్రి):
వర్షాకాలంలో సీజనల్ వ్యాధుల బారిన పడకుండా ప్రజల ఆరోగ్యాన్ని కాపాడేందుకు మందమర్రి మున్సిపాలిటీ ప్రత్యేక చర్యలు చేపట్టిందని మున్సిపల్ కమిషనర్ తుంగపిండి రాజలింగు తెలిపారు. గురువారం మందమర్రి మున్సిపాలిటీ పరిధిలోని 1, 2, 5, 23వ వార్డుల్లో నిర్వహించిన ఫాగింగ్, పారిశుద్ధ్య కార్యక్రమాలు, చెత్త తొలగింపు పనులను కమిషనర్ పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, వర్షాకాలంలో దోమల ద్వారా వ్యాపించే డెంగ్యూ, మలేరియా, చికున్‌గున్యా వంటి వ్యాధులను అరికట్టేందుకు మున్సిపాలిటీ విస్తృత స్థాయిలో నివారణ చర్యలు చేపడుతోందని తెలిపారు.
ఫాగింగ్‌తో పాటు పారిశుద్ధ్య నిర్వహణ, నిల్వ నీటి తొలగింపు, చెత్తను సకాలంలో తరలించడం, బ్లీచింగ్ పౌడర్ చల్లడం వంటి కార్యక్రమాలను నిరంతరం కొనసాగిస్తున్నామని చెప్పారు. ప్రజలు తమ ఇళ్ల పరిసరాల్లో నీరు నిల్వ ఉండకుండా జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. ముఖ్యంగా కొబ్బరి చిప్పలు, పాత టైర్లు, కూలర్లు, పూల కుండీలు, ఇతర పాత్రల్లో నీరు నిల్వ కాకుండా చూసుకోవాలని విజ్ఞప్తి చేశారు. దోమల నివారణలో ప్రజల సహకారం కూడా ఎంతో అవసరమని పేర్కొన్నారు.
ఈ కార్యక్రమంలో ఇన్‌చార్జ్ శానిటరీ ఇన్‌స్పెక్టర్ ఈ. వసంత్, వార్డు బిల్ కలెక్టర్లు, సంబంధిత వార్డు అధికారులు, ఇన్‌చార్జ్ జవాన్ మేకల నరేష్, మున్సిపల్ శానిటేషన్ సిబ్బంది, స్థానిక ప్రజాప్రతినిధులు, కాలనీవాసులు పాల్గొన్నారు. సందర్భంగా వార్డు ప్రజలు మున్సిపల్ కమిషనర్ ఆధ్వర్యంలో చేపడుతున్న ప్రజారోగ్య పరిరక్షణ చర్యలను అభినందిస్తూ, మున్సిపాలిటీ చేపడుతున్న పారిశుద్ధ్య కార్యక్రమాలకు తమ వంతు సహకారం అందిస్తామని తెలిపారు.

