NIGAMA MEDIA (P) LTD
14.2 C
Munich

NIGAMA MEDIA (P) LTD

Tuesday, September 15, 2026

కేటీఆర్ పాదయాత్రతో కష్టాలు తీరేనా ?

Must read

coalbelt 24 News
coalbelt 24 Newshttps://coalbelt24news.com
COAL BELT NEWS, NIGAMA MEDIA Pvt Ltd , Mancherial, Telangana-504208, Mobile : 9603505050.

📰 Generate e-Paper Clip

ప్రజా సమస్యలపై తెలుసుకోవడం
యువతకు ప్రాధాన్యత
పాదయాత్రతో పరిస్థితులు మారేనా ?

కోల్ బెల్ట్ న్యూస్(హైదరాబాద్):

తెలంగాణ రాజకీయాల్లో మరోసారి పాదయాత్ర రాజకీయాలపై చర్చ మొదలైంది. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ వచ్చే ఏడాది రాష్ట్రవ్యాప్తంగా విస్తృత పాదయాత్ర చేపట్టే అవకాశాలపై రాజకీయ వర్గాల్లో జోరుగా చర్చ సాగుతోంది. పార్టీ శ్రేణుల్లో నూతన ఉత్సాహాన్ని నింపడంతో పాటు ప్రజలతో ప్రత్యక్ష అనుసంధానం పెంచుకోవడమే ఈ యాత్ర ప్రధాన ఉద్దేశమని ప్రచారం జరుగుతోంది.

ఇటీవలి ఎన్నికల్లో ఎదురైన ఎదురుదెబ్బల తర్వాత పార్టీ క్యాడర్‌లో ఆత్మవిశ్వాసాన్ని పెంచడం, ప్రజల మధ్య పార్టీ ఉనికిని మరింత బలోపేతం చేయడం కోసం కేటీఆర్ పాదయాత్రను కీలక రాజకీయ వ్యూహంగా భావిస్తున్నట్లు సమాచారం. తెలంగాణ రాజకీయాల్లో మారుతున్న పరిస్థితులను దృష్టిలో పెట్టుకుని ప్రజల సమస్యలను నేరుగా తెలుసుకుంటూ ప్రభుత్వ వైఫల్యాలను ప్రజల్లోకి తీసుకెళ్లే లక్ష్యంతో ఈ కార్యక్రమాన్ని రూపొందిస్తున్నట్లు రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.

గతంలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో వైఎస్ రాజశేఖర్ రెడ్డి చేపట్టిన ‘ప్రజాప్రస్థానం’, అనంతరం చంద్రబాబు నాయుడు నిర్వహించిన ‘వస్తున్నా మీకోసం’, వైఎస్ జగన్ మోహన్ రెడ్డి చేపట్టిన ‘ప్రజాసంకల్ప యాత్ర’, తెలంగాణలో రేవంత్ రెడ్డి, భట్టి విక్రమార్క, వైఎస్ షర్మిల చేపట్టిన పాదయాత్రలు ప్రజాభిప్రాయంపై గణనీయమైన ప్రభావం చూపిన విషయం తెలిసిందే. ఇదే తరహాలో ప్రజలతో ప్రత్యక్షంగా మమేకమయ్యే వ్యూహంపై బీఆర్ఎస్ నాయకత్వం దృష్టి సారించినట్లు సమాచారం.

కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రకటించిన ఆరు గ్యారంటీల అమలు, రైతు సమస్యలు, రుణమాఫీ, రైతుభరోసా నిధుల పంపిణీ, ఉద్యోగ నియామకాలు, జాబ్ క్యాలెండర్, గ్రామీణాభివృద్ధి, సాగునీటి ప్రాజెక్టుల నిర్వహణ వంటి అంశాలను పాదయాత్రలో ప్రధానంగా ప్రస్తావించే అవకాశం ఉందని రాజకీయ వర్గాలు భావిస్తున్నాయి. ఈ అంశాలపై ప్రజల్లో ఉన్న అసంతృప్తిని రాజకీయంగా మలుచుకునే ప్రయత్నం బీఆర్ఎస్ చేయవచ్చని విశ్లేషణలు వినిపిస్తున్నాయి.

కేటీఆర్‌కు పట్టణ ప్రాంతాలు, యువతలో మంచి ఆదరణ ఉందనే అభిప్రాయం ఉన్నప్పటికీ, గ్రామీణ ప్రాంతాల్లో రైతులు, మహిళలు, అట్టడుగు వర్గాలతో ప్రత్యక్ష అనుసంధానం ఎంత మేరకు ఏర్పరుచుకోగలరన్నది ఈ పాదయాత్ర విజయాన్ని నిర్ణయించే కీలక అంశంగా భావిస్తున్నారు. రాష్ట్ర రాజకీయాల్లో పాదయాత్రలు గతంలో ఎన్నోసార్లు కీలక మలుపులు తిప్పిన నేపథ్యంలో, కేటీఆర్ కూడా అదే బాటలో ముందుకు సాగుతారా? ఈ యాత్ర బీఆర్ఎస్‌కు రాజకీయంగా కొత్త ఊపు తీసుకొస్తుందా? అనే అంశాలపై రాజకీయ వర్గాల్లో ఆసక్తికర చర్చ కొనసాగుతోంది.

More articles

Latest article

App Icon

Install CBN News App

Add to home screen for faster loading and latest updates.