20.9 C
Munich
Sunday, July 26, 2026

సీఎస్‌ పదవి నుంచి సీఎం సలహాదారుగా..

Must read

coalbelt 24 News
coalbelt 24 Newshttps://coalbelt24news.com
COAL BELT NEWS, NIGAMA MEDIA Pvt Ltd ,RNI No : 192138/2024, Date : 20-12-2024, Mancherial, Telangana-504208, Mobile : 9603505050.

📰 Generate e-Paper Clip

తెలంగాణలో కొత్త రాజకీయ సంప్రదాయమా ?
రాష్ట్ర అభివృద్ధిలో భాగమా ?

కోల్ బెల్ట్ ప్రతినిధి:
తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి (సీఎస్) కె. రామకృష్ణారావు ఈ నెల 30న పదవీ విరమణ చేయనున్నారు. ఆయన స్థానంలో 1992 బ్యాచ్‌కు చెందిన సీనియర్ ఐఏఎస్ అధికారి సంజయ్ జాజును నూతన సీఎస్‌గా నియమిస్తూ రాష్ట్ర ప్రభుత్వం జీఓ జారీ చేసింది.

ఇదిలా ఉండగా, పదవీ విరమణ అనంతరం కె. రామకృష్ణారావును ముఖ్యమంత్రి సలహాదారుగా నియమించారు. దీంతో సీఎస్‌గా రిటైర్ అయిన అధికారులను తిరిగి ప్రభుత్వంలో కీలక బాధ్యతల్లో కొనసాగించే సంప్రదాయం తెలంగాణలో మరింత బలపడుతున్నట్లు కనిపిస్తోంది.

గతంలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లోనూ, తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావం తర్వాత తొలినాళ్లలోనూ సీఎస్‌గా పదవీ విరమణ చేసిన ఐఏఎస్ అధికారులు గౌరవప్రదంగా బాధ్యతల నుంచి తప్పుకునేవారు. పదవీకాల పొడిగింపులు లేదా రీ-అపాయింట్‌మెంట్‌లు చాలా అరుదుగా జరిగేవి. అయితే కాలక్రమేణా రాజకీయ పరిస్థితులు మారడంతో ఈ ధోరణిలోనూ మార్పు వచ్చింది.

ఈ విధానానికి బాట వేసింది గత బీఆర్ఎస్ ప్రభుత్వం. మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ తన హయాంలో సీఎస్‌లుగా పనిచేసిన రాజీవ్ శర్మ, ఎస్.కె. జోషి, సోమేష్ కుమార్ వంటి పలువురు సీనియర్ ఐఏఎస్ అధికారులకు పదవీ విరమణ అనంతరం క్యాబినెట్ హోదాతో కూడిన సీఎం ముఖ్య సలహాదారు పదవులు అప్పగించారు.

అప్పుడు ఈ విధానాన్ని తీవ్రంగా విమర్శించిన కాంగ్రెస్ పార్టీ, ఇప్పుడు అధికారంలోకి వచ్చిన తర్వాత అదే పంథాను కొనసాగిస్తోందనే చర్చ రాజకీయ వర్గాల్లో వినిపిస్తోంది. ఇప్పటికే మాజీ సీఎస్ శాంతికుమారికి కీలక బాధ్యతలు అప్పగించిన ప్రభుత్వం, ఇప్పుడు కె. రామకృష్ణారావును కూడా సీఎం సలహాదారుగా కొనసాగించాలని నిర్ణయించడం ఇందుకు నిదర్శనంగా చెబుతున్నారు.

పాలనా వ్యవస్థలో అత్యున్నత స్థానమైన సీఎస్‌గా పనిచేసే అధికారులకు ప్రభుత్వ అంతర్గత వ్యవహారాలు, కీలక విధాన నిర్ణయాలు, పరిపాలనా అనుభవంపై సమగ్ర అవగాహన ఉంటుంది. ఆ అనుభవాన్ని ప్రభుత్వానికి ఉపయోగించుకోవాలనే ఉద్దేశంతోనే వారిని పదవీ విరమణ తర్వాత కూడా కీలక బాధ్యతల్లో కొనసాగిస్తున్నారని అధికార వర్గాలు పేర్కొంటున్నాయి.

అయితే మరోవైపు, ఏ ప్రభుత్వం అధికారంలో ఉన్నా “సీఎస్ పదవి దిగగానే సీఎం సలహాదారు పదవి” అనే కొత్త సంప్రదాయం తెలంగాణ రాజకీయ-పరిపాలనా వ్యవస్థలో స్థిరపడుతోందనే అభిప్రాయం రాజకీయ విశ్లేషకుల్లో వ్యక్తమవుతోంది. ఈ ధోరణి భవిష్యత్తులో కూడా కొనసాగుతుందా? లేక పరిస్థితులకు అనుగుణంగా మారుతుందా? అనేది వేచి చూడాల్సి ఉంది.

Author

More articles

Latest article

App Icon

Install CBN News App

Add to home screen for faster loading and latest updates.