Inavolu : నుదుటికి బండారి బొట్టు…..పసుపు, తెలుపు, ఆకుపచ్చ రంగులతో పట్నాలు…చేతిలో ఈరగోలలు…. శివసత్తుల పూనకాలతో తెలంగాణ పల్లెలన్నీ బయలు దేరి ఐనవోలు మల్లన్న జాతరకు చేరుకున్నాయి. ఐనవోలు మల్లికార్జున స్వామి క్షేత్రం తెలంగాణలో ప్రసిద్ద ఆధ్యాత్మిక కేంద్రం. గొల్ల కేతమ్మ, బలిజ మేడమ్మ సమేతంగా మల్లికార్జునుడు కొలువుదీరిన క్షేత్రంలో గజ్జెల్లాగుల సవ్వడి.. డమరుక నాధాల ప్రతిద్వవి…ఒగ్గుడోలు వాయిద్యాల మధ్య శివసత్తుల పూనకాలతో ఐనవోలు మల్లన్న క్షేత్రం దద్దరిల్లిపోతుంది.
ఐనవోలు క్షేత్రంలో సంక్రాంతి పండుగతో మొదలై ఉగాది పండుగతో మల్లికార్జున స్వామి బ్రహ్మోత్సవాలు మహా వైభవంగా ముగుస్తాయి. కోరిన కోరికలు తీరితే కోరమీసాలు వెండితో చేయించి పెడుతారు. తెలుగు రాష్ట్రాలతో పాటు దేశంలోని వివిధ ప్రాంతాల నుంచి భక్తులు తరలి వస్తారు. కొబ్బరికాయతో ముడుపు కడుతారు. బోనం చెల్లిస్తారు. తలనీలాలు సమర్పిస్తారు.
కాకతీయుల కాలం నుంచే ఐనవోలు గ్రామానికి చెందిన మార్నేని వంశస్తులు ఆలయం భాద్యతలు నిర్వహిస్తున్నారు. 1969లో భాద్యతలను దేవాదాయ శాఖ చేపట్టింది అప్పటి నుంచి ఐనవోలు మల్లికార్జున స్వామి దేవస్థానంలో బ్రహ్మోత్సవాలు జరుగుతున్నాయి. ప్రతి ఈటా సంక్రాంతి నుంచి మొదలై ఉగాది వరకు కొనసాగుతాయి.