Yadagirigutta: లక్ష్మీనర్సింహ స్వామి కొలువైన పుణ్య క్షేత్రం యాదగిరిగుట్ట.అటువంటి ప్రసిద్ధ పుణ్య క్షేత్రానికి పాలక మండలి లేదు. గత 15ఏళ్లుగా పాలకమండలి లేదంటే నమ్మలేని పరిస్థితి. కానీ నేటికీ పాలక మండలి లేకుండానే ఆలయం పనులు కొనసాగడం విశేషం. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే ఈ సమస్యపై దృష్టిసారించింది. తిరుమల,తిరుపతి దేవస్థానం మాదిరిగా యాదగిరిగుట్ట దేవస్థానంకు పాలకమండలి ఏర్పాటు చేయాలని సీఎం రేవంత్ రెడ్డి నిర్ణయించారు.
పాలక మండలి ఏర్పాటుకు పలు న్యాయపరమైన చిక్కులు ఉన్నట్టు రాష్ట్ర ప్రభుత్వం గుర్తించింది. చట్ట సవరణ కూడా అవసరమేనని ప్రభుత్వం భావిస్తున్నట్టు సమాచారం. వీటన్నిటిని అధిగమించి పాలక మండలి ఏర్పాటుకు ప్రభుత్వం ముందుకు వెళుతున్నట్టు తెలిసింది.
యాదగిరి లక్ష్మీనర్సింహ స్వామి దేవస్థానం ఉద్ఘాటన తర్వాత గత ప్రభుత్వం పాలక మండలిని ఏర్పాటు చేయలేదు. సుమారు 15 ఏళ్ల నుంచి పాలక మండలి లేకపోవడంతో పరిపాలన పరంగా దేవస్థానంలో ఇబ్బందులు సైతం ఎదురయ్యాయి. 2008 లో ఏర్పడిన పాలక మండలి 2010 వరకు మాత్రమే భాద్యతలు నిర్వహించింది. అప్పటి నుంచి అంటే దాదాపుగా 15 ఏళ్ల నుంచి పరిపాలన పరంగా ఎవరికీ కూడా ఆలయంలో భాద్యతలు లేవు. ప్రత్యేక అధికారి చేతిలోనే దేవస్థానం నిర్వహణ కొనసాగుతోంది.
1987 నాటి తెలంగాణ ధార్మిక, హిందూ మత సంస్థలు, ఎండోమెంట్స్ చట్టాన్ని ప్రభుత్వం ముందుగా సవరించాల్సి ఉంది. ఆ తరువాతనే పాలక మండలి ఏర్పాటు సాధ్యమవుతుందనే అభిప్రాయాలూ సైతం వ్యక్తమవుతున్నాయి. రాష్ట్ర ప్రభుత్వం ఒక అడుగు ఇప్పుడు ముందుకు వేసింది. తెలంగాణ ధార్మిక, హిందూ మత సంస్థలు, దేవాదాయ చట్టం 1987లోని సెక్షన్ 151లోని నిర్దిష్ట క్లాజులను సవరించడానికి ప్రభుత్వం సన్నద్ధమవుతోంది.