- మద్దతు పలికిన ఎమ్మెల్యేలు
- వంశీ గెలుపు ఖాయం
- కలిసికట్టుగా కృషిచేస్తాం
——————-
కోల్ బెల్ట్ న్యూస్:మంచిర్యాల
——————-
పార్లమెంట్ ఎన్నికల అభ్యర్థుల వేట ఇంకా ప్రధాన పార్టీల్లో కొనసాగుతూనే ఉంది.రాష్ట్రంలో భారత రాష్ట్ర సమితి 17 స్థానాలకు అభ్యర్థులను ప్రకటించింది.కాంగ్రెస్,బీజేపీ ఇంకా వడపోతలోనే ఉన్నాయి.కాంగ్రెస్ పార్టీ ప్రకటించిన పార్లమెంట్ స్థానాల్లో పెద్దపల్లి చాల కీలకమైనది.ఎందుకంటే ఈ స్థానం నుంచి మొదటి నుంచి గడ్డం వెంకటస్వామి,ఆ తరువాత ఆయన కుమారుడు డాక్టర్ వివేక్ వెంకట స్వామి ప్రాతినిధ్యం వహించారు.తాజాగా చెన్నూర్ ఎమ్మెల్యే వివేక్ వెంకటస్వామి తనయుడు గడ్డం వంశీ అసెంబ్లీ ఎన్నికలు ముగిసిన నాటినుంచి పెద్దపల్లి టికెట్ కోసం పోటీపడుతున్నారు.కాకా వెంకటస్వామి కుటుంబానికి ఢిల్లీ లో ఉన్న తత్సంబందాలే కావచ్చు, యువతకు అవకాశాలు ఇవ్వాలనే ఉద్దేశ్యం తో అయినా వంశీకి టికెట్ దక్కివుండవచ్చు అనే అభిప్రాయాలు సైతం వ్యక్తం అవుతున్నాయి.పెద్దపల్లి పార్లమెంట్ స్థానం నుంచి పోటీ చేయడానికి పదికి పైగా నాయకులు టికెట్ కోసం కుస్తీ పడ్డారు.ఎవరి ప్రయత్నాలు వారు చేయడంలో తప్పులేదు.కాకా వెంకట స్వామి కాంగ్రెస్ జెండానే చివరివరకు మోశారు.కానీ అయన కుమారులు మాత్రం అటుఇటు మారడంతోనే పార్టీని నమ్ముకొని ఉన్నవారిలో అసంతృప్తి నెలకొంది.అందుకే పార్టీలు మారుతున్న వారికీ టికెట్ ఇవ్వడంపై నేటికీ పెద్దపల్లి పార్లమెంట్ పరిధిలో అక్కడక్కడ పలువురిలో అసంతృప్తి ఉంది.
వంశీని గెలిపించుకుంటాం ….
పలువురు ఎమ్మెల్యేలు సైతం మాజీ ఎంపీ డాక్టర్ సుగుణ కుమారిని సైతం తెరపైకి తీసుకువచ్చారు. ఎట్టకేలకు పార్లమెంట్ పరిధిలోని ఏడుగురు ఎమ్మెల్యేలల్లో ఇద్దరు కూడా వంశీ రక్తసంబంధీకులే.మిగిలిన ఐదుగురు కాంగ్రెస్ ఎమ్మెల్యేలే కావడం విశేషం.ప్రస్తతం వంశీ ముందు అసంతృప్తితో ఉన్న నాయకులను బుజ్జగించడమే మిగిలింది.కీలకమైన ఐదుగురు ఎమ్మెల్యేలు ఒక్కతాటిపైకి వచ్చిన నేపథ్యంలో వంశీ గెలుపు సులభమే అవుతుంది.వంశీ గెలుపు కోసం పార్లమెంట్ ఇంచార్జి గ మంథని ఎమ్మెల్యే,రాష్ట్ర మంత్రి శ్రీధర్ బాబును పార్టీ అధిష్టానం నియమించింది.వంశీ గెలుపు భారం శ్రీధర్ బాబు భుజాలపై కూడా ఉంది. ఐదుగురు ఎమ్మెల్యేలు కలిసికట్టుగా పనిచేస్తే వంశీ గెలవడం అంత కష్టమేమి కాదనే అభిప్రాయాలూ సైతం వ్యక్తం అవుతున్నాయి.అందుకే ఆ ఐదుగురు ఎమ్మెల్యేలు మాకు వంశీ అంటే ఇష్టమే. వంశీని గెలిపించు కుంటామని కుండబద్దలు కొట్టినట్టు హైదరాబాద్ లో విలేకరుల సమావేశంలో ప్రకటించడం విశేషం.