Central Government Cong : దేశంలో ఎన్నికల కురుక్షేత్రం ముగిసింది. నాలుగు వందల స్థానాలు పక్కా సాధిస్తామని బీజేపీ నేతలు ధీమాగా ఉన్నారు. మూడోసారి కూడా అధికారం తమదేనని కాషాయం నేతలు సంబరపడి పోతున్నారు. కానీ సీఎం రేవంత్ రెడ్డి మాత్రం బీజేపీ కేంద్రంలో అధికారంలోకి రానే రాదని స్పష్టం చేస్తున్నారు. కేంద్రంలో అధికారంలోకి వచ్చేది ముమ్మాటికి ఇండియా కూటమేనని పక్కా లెక్కలతో సహా చెప్పేస్తున్నారు. కాంగ్రెస్ అభ్యర్థి ప్రధాన మంత్రి అవుతారని కూడా ప్రకటించారు. ఇండియా కూటమి అత్యధిక స్థానాల్లో విజయం సాధించి కేంద్రంలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తుందని సీఎం రేవంత్ రెడ్డి ధీమా వ్యక్తం చేశారు. ఆయన కేరళలో పర్యటించిన సందర్బంగా ఎన్డీయే కూటమికి, ఇండియా కూటమికి ఎన్ని స్థానాలు వస్తున్నాయో కూడా చెప్పేస్తున్నారు. ఏయే రాష్ట్రాల్లో ఎన్ని సీట్లు సాధించేది కూడా సీఎం స్పష్టం చేశారు.
బీజేపీ నాలుగు వందల సీట్లు ఎందుకు సాధించలేదో కూడా వివరణ ఇచ్చారు సీఎం. కాషాయం పార్టీ అభ్యర్థులు తమిళనాడు, కేరళ రాష్ట్రాల్లో ఒక్కరు కూడా గెలిచే పరిస్థితి లేదన్నారు. ఆంధ్ర ప్రదేశ్, తెలంగాణ, కర్ణాటక రాష్ట్రాల్లో బీజేపీ అభ్యర్థులు 20 స్థానాల్లో గెలిచే అవకాశం ఉందన్నారు. దక్షణాది రాష్ట్రాల్లో మొత్తం 121 పార్లమెంట్ స్థానాలు ఉన్నాయి. వాటిలో ఇండియా కూటమి అభ్యర్థులు 100 స్థానాల్లో గెలవడం ఖాయమన్నారు. ఉత్తర భారత దేశంలో గుజరాత్, ఢిల్లీ, హర్యానా, రాజస్థాన్ రాష్ట్రాల్లో బీజేపీ తుడిచిపెట్టుకు పోవడం ఖాయమని సీఎం రేవంత్ రెడ్డ్ జోస్యం చెప్పారు. ఆ రాష్ట్రాల్లో కాంగ్రెస్, ఇండియా కూటమి అభ్యర్థులు అత్యధిక స్థానాల్లో విజయం సాధించడం ఖాయమన్నారు.
వాస్తవానికి సీఎం రేవంత్ రెడ్డి గణాంకాలను ఏ మాత్రం తప్పుపట్టడానికి వీలులేదని రాజకీయ వర్గాలు అభిప్రాయపడుతున్నాయి. కేంద్రంలో రెండుసార్లు అధికారం చేపట్టిన నేపథ్యంలో దేశంలోని పలు ప్రాంతాల్లో అనుకూలం ఎంత ఉందొ, వ్యతిరేకత కూడా అంతే ఉందనే అభిప్రాయాలు రాజకీయ మేధావులు వ్యక్తం చేస్తున్నారు. కాబట్టి రేవంత్ రెడ్డి ఆశలు కూడా అతిగా అనిపించడంలేదనే అభిప్రాయాలు వ్యక్తం కావడం విశేషం. దక్షణాదిలో ఒక్క ఏపీలో కూటమిగా ఏర్పడటంతో బీజేపీ కి బలం ఏర్పడుతుంది. అంతేకాని మిగతా రాష్ట్రాల్లో కాషాయం అంతగా బలం చూపించే అవకాశాలు ఎక్కడ కూడా కనబడుటలేదు. తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి చెప్పిన పార్లమెంట్ ఎన్నికల గణాంకాల ప్రకారం కేంద్రంలో ఇండియా కూటమి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిన ఆశ్చర్య పోవాల్సిన అవసరం లేదనే అభిప్రాయాలు సైతం గట్టిగానే వినిపిస్తున్నాయి.